తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్‌ సీట్లు అంటూ...

CCS Arrests Cheating Students Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్‌ సీటు ఇపిస్తానని వందల మంది విద్యార్థుల నుంచి కోట్లు రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని  సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా వీకోట మండలం పాముగాని గ్రామానికి చెందిన కిషన్‌రెడ్డి గత పది సంవత్సరాల నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లో ఇగ్గి మల్టీసర్వీస్ పేరుతో ఫిలిప్పీన్స్ లోని సీడీయూ యూనివర్సిటీలలో మెడిసిన్ సీటు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి 30 లక్షల రూపాయలు వరకు వసూలు చేశాడు.

ముందుగా లక్ష రూపాయలు విద్యార్థు నుంచి వసూలు చేసి యూనివర్సిటీకు కట్టి అడ్మిషన్లు ఇప్పిస్తాడు. తాము ఫీజు కట్టినా కట్టలేదని యూనివర్సిటీల నుంచి ఫోన్లు  రావడంతో కిషన్‌రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదు ఎవరికీ చెప్పకుంటారో చెప్పుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ పిల్లల చదువులకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అతడి వద్ద ఉండటంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థుల తల్లిదండ్రులు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి తప్పించుకుని తిరుగుతున్న కిషన్‌రెడ్డిని వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ అతని వద్దే ఉన్నాయని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమకు ఇప్పించాలని డీసీపీని తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని మరెవరికి జరగకుండా అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మెడిసన్ సీట్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసి స్థిరాస్తులు కూడబెట్టుకున్న వాటిని జప్తు చేసి  నష్టపోయిన వారికి ఇవ్వాలని పోలీసులకు విన్నవించుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top