కీచక ఉపాధ్యాయుడిపై కేసు

Case Registered On School Teacher For Molesting Students - Sakshi

తరగతి గదిలో విద్యార్థిపై అసభ్యకర ప్రవర్తన

ఫిర్యాదు చేసి బాధిత విద్యార్థిని కీచక ఉపాధ్యాయుడిపై కేసు

సాక్షి, భువనేశ్వర్‌ : విద్యా బుద్దులు నేర్పించి భవిష్యత్‌లో సమాజానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే, తరగతి గదిలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు బజారు మనిషిలా వ్యవహరిస్తే అలాంటి ఉపాధ్యాయులను ఏమనుకోవాలి. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సరిగ్గా అదే జరిగింది. ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న ఎ.రాంబాబు అనే ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనలకు గురి చేసేవాడు. లైంగిక వేధింపులు భరించలేని పదో తరగతి విద్యార్థిని నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంటే ఆ ఉపాధ్యాయుడు కీచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం గురువారం దుమారం రేగిన సంగతి తెలిసిందే.  ఆ దుమారానికి విద్యార్థిని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తెరపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ అందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఎ.రాంబాబు విద్యార్థినిల పట్ల  కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అభం శుభం తెలియని విద్యార్థినిల శరీరంపై చేతులు వేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ ఎట్టకేలకు పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయుడు రాంబాబుపై 354(ఎ), 509, సెక్షన్‌ 8, 12 ఆఫ్‌ ఫోక్సో చట్టాలు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  శుక్రవారం బాధిత విద్యార్థిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కీచక ఉపాధ్యాయుడి భాగోతం బట్టబయిలయ్యింది.

కేసు నమోదు చేసాం...
బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణితం ఉపాధ్యాయుడు ఎ.రాంబాబుపై కేసు నమోదు చేసామని ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ తెలిపారు. తరగతి గదిలో తమ శరీరంపై చేతులు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో విద్యార్థిని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు 354(ఎ), 509, సెక్షన్‌ 8, సెక్షన్‌ 12 ఆఫ్‌ ఫోక్సో చట్టాలు క్రింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top