ఇద్దరు టీవీ రిపోర్టర్లపై కేసు నమోదు

Case Files Against Two TV Reporters on Money Demands Police Constable - Sakshi

సికింద్రాబాద్‌: జైళ్ల శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్‌ నుంచి డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు టీవీ విలేకరులపై సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి కథనం ప్రకారం జైళ్లశాఖ  కానిస్టేబుల్‌ భాస్క రాచారి మంచిర్యాల జిల్లా నస్‌పూర్‌లోని అత్తగారింటికి వెళ్లేందుకు ఈనెల 26న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఆయన తనతో పాటు రెండు టేకు చెక్కలను వెంట తెచ్చుకున్నాడు. పార్శిల్‌ సర్వీసు కార్యాలయం వేళలు ముగియడంతో ఆ చెక్కలను రైలులో తనవెంట తీసుకుని దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. అదే సమయంలో  ఇద్దరు టీవీ విలేకరులు (సాక్షి కాదు) వచ్చి గంధం చెక్కలు ఎక్కడి వంటూ నిలదీశారు. తాను తీసుకెళ్తున్నది గంధం చెక్కలు కావని,  టేకు చెక్కలని, రూ.1900లకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాని వివరించే యత్నం చేసినా వారు వినలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన జీఆర్‌పీ పోలీసులు రెండు టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.

టేకు చెక్కలు తాను కొనుగోలు చేసినవేనని చెబుతున్నా  టీవీ విలేకరులు వినకుండా తనను డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని కానిస్టేబుల్‌ భాస్కరాచారి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీఆర్‌పీ పోలీసులు చెక్కల కొనుగోలుకు సంబంధించి బిల్లలు ఇవ్వాలని భాస్కరాచారిని కోరారు. భాస్కరాచారి బిల్లులు తెచ్చి వారికి చూపించే లోపే ఆ ఇద్దరు విలేకరులు స్క్రోలింగ్‌ ప్రారంభించారు.  అయితే బిల్లుల ఆధారంగా భాస్కరాచారి తన వెంట తెచ్చుకున్న ఆ రెండు చెక్కలు టేకు కలపగా జీఆర్‌పీ పోలీసులు నిర్ధారించుకున్నారు. టేకు చెక్కలను గంధం చెక్కలుగా ఆరోపించడంతోపాటు తనను డబ్బులు డిమాండ్‌ చేయడమే కాకుండా,  జైళ్ల శాఖ ఉన్నతాధికారులపై అసత్య ప్రసారం చేసినందుకు ఆ ఇరువురు టీవీ విలేకరులపై  భాస్కరాచారి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top