ఏపీ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదు

Case Filed Againist AP Congress Woman President Padma Sri In Aathkuru PS - Sakshi

సాక్షి, ఉంగుటూరు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్‌ ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదయింది. తన కుమారుడు చెరువులో పడి మృతి చెందగా పరిహారంగా వచ్చిన డబ్బును కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇవ్వడం లేదని పఠాన్ మరియంబీ అనే మహిళ ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో బాధితురాలు మరియంబీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకురాగా, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

రెండేళ్ల కిందట తన కుమారుడు ఓ డైరీలో ఫాంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ పక్కనున్న చెరువులో పడి చనిపోయాడని, డైరీ ఫాం యజమానిపై ఎటువంటి కేసు లేకుండా ఉండేందుకు గానూ సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం చేసి డబ్బుకు తీసుకున్నారని మరియంబీ తెలిపారు. యజమాని దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుంకర పద్మశ్రీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అరాచకాలు బయటపెట్టినందుకే అక్రమ కేసులు: సుంకర పద్మశ్రీ
తనపై కేసు పెట్టడంతో సుంకర పద్మశ్రీ  స్పందించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేస్తున్న అరాచకాలను బయట పెట్టినందుకు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. చిక్కవరంలోని బ్రహ్మలింగయ్య చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో కోట్ల రూపాయలు దోచుకున్న విషయాన్ని బయటపెట్టినందుకు కక్ష గట్టారని తెలిపారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో పఠాన్ మరియంబీ అనే మహిళతో కేసు నమోదు చేయించారని వెల్లడించారు.

అసలు ఆమెతో తనకు సంబంధం లేదని, తన కుమారుడు టీడీపీ నేత డైరీ ఫాంలో పడి మృతి చెందితే నాకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ తనకు విన్నవించుకున్నదని చెప్పారు. ఆమెకు న్యాయం చేయాలంటూ ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు పంపిన సంగతి వాస్తవమన్నారు. వంశీమోహన్ నియోజకవర్గ పరిధిలో చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నందుకు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేయించారని వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top