పాపం..పసివాళ్లు | Boy Died in Swimming Pool Hyderabad | Sakshi
Sakshi News home page

పాపం..పసివాళ్లు

Jun 12 2019 7:26 AM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died in Swimming Pool Hyderabad - Sakshi

వశిష్ట (ఫైల్‌) చికిత్స పొందుతున్న వశిష్ట (ఫైల్‌)

వేర్వేరు ఘటనల్లో ఇద్దరుచిన్నారులు మృతి చెందినసంఘటన మంగళవారం చోటు చేసుకుంది. చందానగర్‌లోప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి అస్వస్థతకు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందగా, కేపీహెచ్‌బీలో ఫుట్‌పాత్‌పై తల్లి వద్ద నిద్రిస్తున్న పసికందు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే..

చందానగర్‌:    సైకిల్‌ తొక్కుతూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోపన్‌పల్లి  న్యూ మంజీరా డైమండ్‌ టవర్స్‌లో ఉంటున్న ఆదిత్య కిరణ్‌ కుమారుడు వశిష్ట (5) ఈ నెల 4న ఉదయం సైకిల్‌ అదుపుతప్పి స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని  స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 6న మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగి మూడురోజులైనా పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు తరచూ ఫోన్‌ చేయడంతో ఈ నెల 7న ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు మృతుని కుటుంబ సభ్యుల తెలిపారు. చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై చందానగర్‌ సీఐ రవీందర్‌ మాట్లాడుతూ ఘటన జరిగిన సమయంలో తాను సెలవులో ఉన్నట్లు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని పసికందు మృతి
కేపీహెచ్‌బీకాలనీ: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ యాచకురాలి కుమారుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ టెంపుల్‌ బస్టాప్‌ సెంటర్‌లో సంకొల్లు శివమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త కూలీగా పని చేసేవాడు. వీరికి ఐదునెలల కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి శివమ్మ కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాప్‌లోని ఫుట్‌పాత్‌పై కుమారుడితో కలిసి నిద్రిస్తుండగా తెల్లవారు ఝామున అదే ప్రాంతంలో నిద్రిస్తున్న మరో యాచకురాలు దేవికుమారి నిద్రలేచేసరికి శివమ్మ కుమారుడు తీవ్రగాయాలతో రక్తమోడుతుండటాన్ని గుర్తించి శివమ్మను నిద్రలేపింది. వారు వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement