
దొంగలు తెరిచిన ఏటీఎం మిషన్ ముందుడోర్
విశాఖపట్నం, అనకాపల్లి టౌన్: అనకాపల్లి– పూడిమడక రహదారిలో వరుణ్ మోటర్ షోరూమ్ వద్ద గల ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంక్ సిబ్బంది, స్థానికులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖాతాదారుల అవసరం నిమిత్తం మంగళవారం బ్యాంక్ ఏటీఎం సిబ్బంది రూ. 8 లక్షల నగదును ఏటీఎంలో భద్రపరిచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకూ వర్షం కురవడంతో పక్కనే ఉన్న దుకాణాలను రోజూ కంటే ముందుగానే మూసివేశారు.
రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో ఏటీఎం షట్టర్‌ని మూసివేసి వెళ్లిపోయారు. బ్యాంకు సిబ్బంది బుధవారం వచ్చి ఏటీఎం షట్టర్‌ను తెరిచి చూడగా మిషన్ లోపలిభాగం డోర్‌తీసి, గ్యాస్‌కట్టర్‌తో కట్టి చేసిన ఉంది. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఏటీఎం మిషన్ ముందు డోర్‌ని తీశారుకానీ నగదు ఉన్న డోర్‌ను తీయలేకపోయారు. పట్టణ ఎస్‌ఐ అప్పన్న, క్లూస్‌టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు.