తప్పించారా?.. తప్పించుకున్నాడా?

Animals Theft Fellow Arrested Escaped From Hospital  - Sakshi

సాక్షి,మంచిర్యాలక్రైం: మేకలు, పశువుల దొంగతనం కేసులో సీసీసీ నస్పూర్‌కు చెందిన ఓ యువకుడిని జైపూర్‌ పోలీసులు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించేందుకు వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో అక్కడి నుంచి తప్పించుకొని పారి పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.  

నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ నస్పూర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌ను జైపూర్‌ పోలీసులు మేకలు, పశువుల దొంగతనం కేసులో వారంరోజుల క్రితం కాగజ్‌నగర్‌లో బంధువుల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 23న కోర్టులో రిమాండ్‌కు తరలించేందుకు వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్క డి నుంచి ఇమ్రాన్‌ పారిపోవడంలో పోలీసుల పాత్ర ఉందన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. నేటికి నేటికి నాలుగు రోజులు కావస్తున్నా పోలీసులు అతనికోసం గాలించడంలో అలసత్వం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం మంచిర్యాల, కిష్టంపేట, సీసీసీ ప్రాంతాలకు చెందిన కొందరిని జైపూర్‌ పోలీసులు పశువులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవడం.. వారం రోజుల తర్వాత వదిలిపెట్టడం పరిపాటిగా మారిందని ప్రచారంలో ఉంది. కాగా సయ్యద్‌ ఇమ్రాన్‌పై జగిత్యాల, బెజ్జంకి, మల్లాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీసీ, పోలీస్‌స్టేషన్లలో పశువుల దొంగతనాల కేసులు ఉన్నాయి.  

జిల్లా కేంద్రంలో దొంగల ముఠా? 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ పశువుల దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఇక్కడి నుంచే తమ పనిని యధేచ్ఛగా సాగిస్తోంది. వీరికోసం కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన పోలీసులు గాలిస్తుంటారు. ఇతర జిల్లాలో ఎక్కడ పశువులు, మేకల దొంగతనం జరిగినా అక్కడి పోలీసులు ముందుగా వారిని పట్టుకునేందుకు మంచిర్యాలలోనే మకాం వేస్తుంటారు. గతంలో ఓసారి జమ్మికుంటకు చెందిన పోలీసులు మంచిర్యాలలో పశువుల దొంగల ముఠా నాయకున్ని పట్టుకునే ప్రయత్నంలో ఎస్పైని తోసేసి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ఓ పాత చోరి కేసులో పశు దొంగల ముఠా నాయకునికి సంబంధం ఉన్నట్లు తేలింది. మంచిర్యాల సీసీఎస్‌ పోలీసులకు సమాచారం రావడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆప్రయత్నంలో తెల్లవారుజామున మంచిర్యాలకు చెందిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ను తోసేసి పారిపోవడం గమనార్హం. వెంటనే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ నుంచి సంబందిత కానిస్టేబుల్‌కు ఫోన్‌కాల్‌ రావడం, ఇక్కడ జరిగిన విషయం ఆయన ఫోన్లో చెప్పడంపై పశువుల దొంగలకు పోలీసులే సహకరిస్తున్నట్లు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అంటే ఎంత ఖరుడు గట్టిన ముఠా ఉందో తెలుస్తోంది.  

ఇమ్రాన్‌ను తల్లిదండ్రులకు అప్పగించాం 
సయ్యద్‌ ఇమ్రాన్‌ పోలీçస్‌ కస్టడీ నుంచి తప్పించుకోలేదు. పశువులు, మేకల దొంగతనం కేసులో అతన్ని పట్టుకొచ్చింది వాస్తవమే. కానీ అతను మైనర్‌ అయినందువల్ల విచారణ జరిపి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసి అతన్ని అప్పగించాం. కేసుల్లో ఎండీ తాజ్, సల్మాన్‌ ప్రధాన పాత్రదారులు. తాజ్‌ను ఇటీవల  రిమాండ్‌కు తరలించాం. సల్మాన్‌పై పీటీ వారెంట్‌ వేసి పట్టుకువచ్చాం. అతన్ని జైలుకు పంపిస్తాం. ఇమ్రాన్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్లో కేసు ఉంది. అతను పారిపోయాడనేది ఆవాస్తవం. – విజేందర్, ఎస్సై, జైపూర్‌  

మాకు అప్పగించలేదు 
మేకలు దొంగతనం చేశాడని మాకుమారుడిని జైపూర్‌ పోలీసులు వారంరోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని బంధువుల ఇంటి నుంచి పట్టుకువచ్చారు. వైద్యపరీక్షల నిమిత్తం ఈ నెల 23న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి నన్ను అక్కడికి రమ్మన్నారు. నేను వెళ్లే సరికి నా కొడుకు ఇమ్రాన్‌ అక్కడలేడు. నా కొడుకు ఎక్కడ సారు? అని అడిగితే సంతకం పెట్టుమన్నారు. సంతకం పెట్టిన తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి నా కొడుకు కనిపించడం లేదు.– నయిమా బేగం, ఇమ్రాన్‌ తల్లి   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top