నాసిరకం కొబ్బరి నూనెకు బ్రాండ్‌ కలరింగ్‌ | Adultry Coconut Oil Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

నాసిరకం కొబ్బరి నూనెకు బ్రాండ్‌ కలరింగ్‌

Feb 9 2019 10:54 AM | Updated on Feb 9 2019 10:54 AM

Adultry Coconut Oil Gang Arrest in Hyderabad - Sakshi

అధికారుల తనిఖీల్లో గుర్తించిన నకిలీ ప్యాకెట్లు, డబ్బాలు

కుత్బుల్లాపూర్‌: నాసిరకం కొబ్బరి నూనెను బ్రాండెడ్‌గా ఆకర్షిణీయంగా ప్యాక్‌ చేసి మార్కెట్‌లో విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. కుత్బుల్లాపూర్‌ పరిధి జీడిమెట్ల డివిజన్‌ సుచిత్ర రోడ్డులోని జీన్స్‌ ఫ్యాక్టరీ గల్లీలో వివేక్‌ ఇండస్ట్రీస్‌ భవనం మొదటి అంతస్తులో తతంగం జరుగుతోంది. సుభాష్‌ అలియాస్‌ బవర్‌లాల్‌ అనే వ్యక్తి ఎనిమిది మంది పనివాళ్లతో నకిలీ కొబ్బరి నూనెను ప్రముఖ బ్రాండ్‌ ‘పారాష్యూట్‌’ డబ్బాల్లో ప్యాక్‌ చేసి మార్కెట్‌లో వివిధ దుకాణాల్లో విక్రయిస్తు వస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (రంగారెడ్డి యూనిట్‌) ఎస్పీ ముత్యంరెడ్డి ఆదేశాలతో శుక్రవారం సీఐ రాజు నేతృత్వంలో సిబ్బంది అడ్డాపై దాడులు నిర్వహించారు. 

అక్కడే ప్రింటింగ్‌.. అక్కడే ప్యాకింగ్‌
పారాష్యూట్‌ బ్రాండ్‌తో నకిలీ నూనెను ప్యాకింగ్‌ చేస్తున్న స్థావరంపై విజిలెన్స్‌ అధికారుల దాడులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులకు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. సదరు ముఠా 15 కేజీల డబ్బాల్లో నాసిరకం కొబ్బరి నూనెను వివిధ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. అక్కడే మరో గదిలో ఏకంగా రెండు ప్రింటింగ్‌ యూనిట్లపై పారాష్యూట్‌ బ్రాండ్‌ లేబుళ్లను ముద్రిస్తున్నారు. పారాష్యూట్‌ బాటిళ్ల వంటి ప్లాస్టిక్‌ సీసాల్లో కల్తీ నూనెను నింపి ఆ లేబుళ్లు అతికించి సీల్‌ చేస్తున్నారు. సేకరించిన కొబ్బరి నూనెను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పోసి హ్యాండ్‌పంప్‌ ద్వారా ఫిల్టర్‌ చేసి డబ్బాల్లో నింపుతున్నారు. అక్కడ జరుగుతున్న తతంగంతో అధికారులు కూడా కొద్దిగా తికమక పడ్డారు. దీంతో వారు పారాష్యూట్‌ ఆయిల్‌ ఏరియా సేల్స్‌ మేనేజర్లు రాజేష్, జగన్నాథరెడ్డిని అక్కడికి రప్పించి పరిశీలించాల్సిందిగా కోరారు. సదరు కంపెనీ ప్రతినిధులు ఇది నకిలీ ప్యాకింగ్‌ అని, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. దాదాపు 100 వరకు 15 కేజీల డబ్బాలు, వేల సంఖ్యలో నకిలీ పారాష్యూట్‌ డబ్బాలు, అదే సంఖ్యలో లేబుళ్లను అధికారులు సీజ్‌ చేశారు. వీటి విలువ మొత్తం దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పీసీలు అక్రమ్, జైపాల్‌రెడ్డి, ప్రతాప్‌ ఈ దాడుల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పేట్‌ బషీరాబాద్‌ ఎస్సై పరశురామ్‌ అధికారుల ఆదేశంతో సరుకును, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

నెలకు రెండు రోజులు మాత్రమే..
ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రధాన నిందితుడు సుభాష్‌ అలియాస్‌ బవర్‌లాల్‌ వివేక్‌ ఇండస్ట్రీస్‌ భవన యజమాని వివేక్‌ గుప్తా వద్ద నెలకు రూ.25 వేల అద్దెతో సదరు ప్రాంగణాన్ని తీసుకుని ఈ తతంగాన్ని నడుపుతున్నాడు. అయితే, ఈ నకిలీ ఆయిల్‌ ప్యాకింగ్‌ తతంగం నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరుగుతుందని భవన యజమాని వివేక్‌ తెలపడం ఆసక్తికరమైన అంశం. అసలు అద్దె తీసుకునే వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప ఆ భవనంలో ఏం జరుగుతుందో తెలుసుకోక పోవడంతో ఇప్పుడు వివేక్‌ కూడా చిక్కుల్లో పడ్డాడు. తక్కువ ధరకు బ్రాండెడ్‌ ఆయిల్‌ వస్తుందని వినియోగదారులు, ఎక్కువ అద్దె వస్తుందని భవన యజమానులు ఈ రకంగా మోసపోవద్దని విజిలెన్స్‌ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement