
కరీంనగర్‌క్రైం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి రూ.12 కోట్లు మాయమవడం కలకలం రేపింది. పారిశ్రామికవేత్తలమని పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను అప్పనంగా డబ్బులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిటింగ్‌లో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించడంతో ఇది వెలుగుచూసింది. కరీంనగర్ యూబీఐ బ్రాంచ్ మేనేజర్‌గా సురేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సురేష్‌కుమార్‌కు కామారెడ్డికి చెందిన రాజుతో పరిచయం ఉంది. అతని ద్వారా ముంబైకి చెందిన సౌమిత్ రంజన్ జైన్, మధ్యప్రదేశ్‌లోని జగదల్‌పూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ శుక్లాలు వ్యాపారవేత్తలుగా మేనేజర్‌తో పరిచయం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత రంజన్‌జైన్ తనకు డబ్బులు అవసరం ఉందని, బ్యాంక్ నుంచి రూ.5 కోట్లు ఇస్తే.. అదనంగా కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మేనేజర్.. 2018 అక్టోబర్‌లో మొదటి దఫా రూ.5 కోట్లు ఇచ్చాడు. ఫిబ్రవరిలో రెండో వ్యక్తి మనోజ్ శుక్లా కూడా తనకూ అవసరం ఉందని అడగడంతో అతనికి మరో రూ.7 కోట్లు తీసుకొని వెళ్లి అప్పగించారు. అనంతరం వారు పత్తా లేకుండా పోయారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ బృందం పరిశీలించగా.. లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అన్ని రకాల రికార్డులు పరిశీలించగా.. రూ. 12 కోట్లకు సంబంధించిన సమాచారం లేదు. బ్యాంక్ మేనేజర్‌ను విచారించగా తాను ఇద్దరికి.. రూ.12 కోట్లు ఇచ్చినట్లు తెలిసింది.
అన్నీ అనుమానాలే..
కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో 28 బ్రాంచ్‌లకు చెందిన నగదు నిల్వలను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న సురేష్‌కుమార్ చాలా కాలంపాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కేవలం కొద్ది రోజుల క్రితం పరిచయమైన ఇద్దరికి తాను రూ.12 కోట్లు ఇచ్చానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ అధికారులు రంగంలోకి దిగారని తెలిసింది. ఈ విషయమై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.