జలుబు.. గొంతునొప్పి.. డస్ట్‌ అలర్జీ

Cold, Sore throat and dust allergy to the YS Jagan - Sakshi

     పాదయాత్రలో ఇబ్బంది పడుతున్న  జగన్‌ 

     ఆరున్నర కిలోల బరువు తగ్గిన ప్రతిపక్ష నేత

     కంటి నిండా నిద్ర లేదు...  విశ్రాంతి లేదు  

     ఎన్ని ఇబ్బందులెదురైనా యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్‌  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విపరీతమైన జలుబు, డస్ట్‌ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు గొంతు నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటివి ఆయనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ పల్లెపల్లెనా పాదయాత్ర చేసే క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానుల ఆయన వెంట అడుగులో అడుగేసి నడుస్తున్నారు.

దట్టంగా లేస్తున్న ధూళి రేణువులు జగన్‌ను చుట్టేసి డస్ట్‌ అలర్జీకి కారణమవుతున్నాయి.అయినప్పటికీ పాదయాత్రలో ఎదురొచ్చే అభిమానులు, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ  విరామం లేకుండా నగక సాగిస్తూనే ఉన్నారు. రోజూ రాత్రి పూట పనులన్నీ పూర్తి చేసుకుని, తనను కలిసేందుకు వచ్చిన వారందరితో జగన్‌ మాట్లాడుతున్నారు.

ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సరిగ్గా 8.30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తుండడంతో నిద్ర తక్కువవుతోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనూ ఎవరో ఒకరు కలిసేందుకు వస్తున్నారు. దీంతో శరీరానికి పూర్తిగా విశ్రాంతి కరువైంది. అప్పుడప్పుడూ భోజన విరామానికి సైతం ఆగకుండా నడక సాగిస్తున్నారు. మూడు రోజులుగా జలుబు, గొంతునొప్పి ఎక్కువయ్యాయి. రోడ్ల వెంట లేస్తున్న దుమ్మూ ధూళి నోటిలోకి పోతుండడంతో గొంతునొప్పి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

జలుబు, దగ్గు కారణంగా జగన్‌ నలతగా ఉంటున్నారు. గురు, శుక్రవారాల్లో విపరీతమైన ఎండ కారణంగా గొంతు త్వరగా తడారిపోయి నీరసంగా కనిపించారు. శుక్రవారం పాదయాత్ర మొదలైంది మొదలు గంటకోసారి ఆయన జలుబు, తుమ్ములతో సతమతమయ్యారు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జగన్‌ అరున్నర కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు, పార్టీ నేతలు కోరుతున్నా జగన్‌ వినడం లేదు. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.   

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top