ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ ట్రాకర్స్‌ తయారీ కేంద్రం

Volty IoT to set up mfg plant in Andhra Pradesh - Sakshi

ముందుకొచ్చిన వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌

ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 50 కోట్ల దాకా వ్యయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ ఫౌండర్‌ కోణార్క్‌ చుక్కపల్లి చెప్పారు.  సేల్స్‌ డైరెక్టర్‌ పి.ఆర్‌.రాజారామ్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్‌ 140 ప్రమాణాలు గల జీపీఎస్‌ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్‌ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

పరికరాలకు భారీ డిమాండ్‌..: నవంబర్‌ 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్‌ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఎస్‌ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్‌ కంపెనీకి కలిసొస్తుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top