
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్ యూజర్లు ఇకపై బస్సు ప్రయాణాలకు పట్టే సమయం, ప్లాట్‌ఫాంపై రైళ్ల రాక గురించిన వివరాలను లైవ్‌లో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. అలాగే, ఆటో, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చే ఫీచర్‌ను మ్యాప్స్‌లో పొందుపర్చినట్లు వివరించింది. లైవ్ ట్రాఫిక్ వివరాలు అందించడం ద్వారా తమ యూజర్లకు ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రెయిన్ రన్నింగ్ స్టేటస్‌ను గురించి తెలుసుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్ల లిస్టు వివరాలు పొందవచ్చు. గతేడాది కొనుగోలు చేసిన వేర్ ఈజ్ మై ట్రెయిన్ యాప్ సంస్థతో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ పేర్కొంది.