‘వాణిజ్యం’ కొంటున్నారా? | Trade encourages bartering over buying | Sakshi
Sakshi News home page

‘వాణిజ్యం’ కొంటున్నారా?

Jul 25 2014 11:39 PM | Updated on Sep 2 2017 10:52 AM

‘వాణిజ్యం’ కొంటున్నారా?

‘వాణిజ్యం’ కొంటున్నారా?

రానున్న ఐదేళ్లలో నగరంలో ఎంతలేదన్నా 2 కోట్ల చ.అ. విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో నగరంలో ఎంతలేదన్నా 2 కోట్ల చ.అ. విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఫ్లాట్లపై 2 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వాణిజ్య స్థలాల్లో పెట్టుబడికి పరిశీలించాల్సిన అంశాలేమిటో చూద్దాం.

వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో పెట్టుబడి పెట్టాలి. వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారమున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.
 
ఇవే కీలకం..
ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి.
భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి.
వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెంద డానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగడానికి ఆస్కారముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.
కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.
నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement