breaking news
building insurance
-
మీ ఇల్లు భద్రమేనా..!
ఇంటి రుణానికే కాదు... ఇంటికీ బీమా పలు రైడర్లను కలిపి మరీ అందిస్తున్న సంస్థలు.. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు తప్పనిసరి నేపాల్ భూకంప దృశ్యాలు ఇంకా మన కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలతో పాటు లక్షల మందికి చెందిన ఇళ్లు కూలిపోయాయి. పలు నివాసాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జీవితకాలం కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇలా ప్రకృతి వైపరీత్యాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? వీటి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు పరిష్కారమల్లా బీమానే. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని ‘హోమ్ ఇన్సూరెన్స్’ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. ‘హోమ్ ఇన్సూరెన్స్’ ఇపుడిపుడే దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్న వారు కేవలం గృహరుణ చెల్లింపులకే కాకుండా ఇంటి మొత్తానికి బీమా రక్షణ తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యా తేడా ఏంటంటే... గృహరుణ చెల్లింపులకు మాత్రమే బీమా తీసుకున్న పక్షంలో గృహ రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగి మరణిస్తే ఇక చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి బ్యాంకులకు చెల్లించేస్తుంది. అలా కాకుండా ఇంటి మొత్తానికి బీమా తీసుకుంటే ఆ కలల సౌధానికి ఎటువంటి నష్టం జరిగినా దాన్ని భర్తీ చేసుకునే వీలుంటుంది. బీమా వ్యవహారిక భాషలో హోమ్ ఇన్సూరెన్స్‌ను రెండు రకాలుగా చెబుతారు. ఒకటి బిల్డింగ్ ఇన్సూరెన్స్. మరొకటి కంటెంట్ ఇన్సూరెన్స్. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా ఇంటి స్ట్రక్చర్‌కు బీమా రక్షణ ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి నిర్మాణం దెబ్బతింటే దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే వ్యయం లేదా కూల్చి పూర్తిగా కొత్తది కట్టుకోవాలంటే దానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకు భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటి నిర్మాణానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని బీమా కంపెని తిరిగి చెల్లిస్తుంది. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇది ఇంటిలోని విలువైన వస్తువులకు బీమా రక్షణ కల్పిస్తుంది. మరీ ఖరీదేం కాదు.. ప్రీమియం ఎంత అనేది మీరు నివసించే ప్రాంతం, ఇంటికి భద్రతకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ప్రీమియం విలువలో సీస్మిక్ జోన్.. అంటే భూకంపం రావడానికి ఉండే అవకాశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ సీస్మిక్ జోన్3లోకి వస్తుంది. అంటే భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. అదే విశాఖపట్నం వచ్చేసరికి భూకంప అవకాశాలు చాలా తక్కువ. దీని ప్రకారం విశాఖపట్నం కంటే హైదరాబాద్ ఇంటికి ప్రీమియం అధికం ఉంటుంది. కాని హైదరాబాద్‌కు సునామీ ముప్పు లేదు. అదే విశాఖపట్నంకు సునామీ తీవ్రత హెచ్చుగా ఉంటుంది. ఇలా ప్రీమియం లెక్కించేటప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకునే భద్రతా చర్యలు కూడా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. అత్యాధునికమైన లాకర్స్, దొంగతనం జరిగేటప్పుడు, అగ్నిప్రమాదం జరిగేటప్పుడు హెచ్చరించే అలారం వంటివి ఏర్పాటు చేసుకుంటే ప్రీమియం ధరలు తగ్గుతాయి. సాధారణంగా భూకంపం, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అధిక అవకాశం ఉన్న వాటికి ప్రతీ రూ.1,000లకు రూపాయి ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. మిగిలిన వాటికి 70పైసలు వరకు ఉంటుంది. అదే కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వస్తువుల విలువను విడివిడిగా లెక్కించి దాని ఆధారంగా బీమా రక్షణ విలువను లెక్కిస్తారు. రైడర్లు ఉన్నాయి.. ఇప్పుడు అన్ని పాలసీలకు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందే రైడర్లను అందిస్తున్నారు. అలాగే హోమ్ ఇన్సూరెన్స్‌లో ఉగ్రవాదుల దాడి, పర్సనల్ యాక్సిడెంట్, సొంతింటి నిర్మా ణం పూర్తి అయ్యే వరకు నివాసము ఉండటానికి అద్దె చెల్లించే విధంగా పలు రైడర్లు అందుబాటులో ఉన్నాయి. అన్నీ డాక్యుమెంట్‌లోనే... పాలసీ డాక్యుమెంట్లో వేటికి బీమా రక్షణ కల్పిస్తారు, వేటికి ఉండదో వివరంగా ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని ఒకసారి పరిశీలించడం తప్పనిసరి. ఇంటిలో ఉండే నగదు, విలువైన కాగితాలు, బాండ్లు వంటి వాటికి బీమా రక్షణ ఉండదు. వీటిని ఇంటిలోని వారే దొంగలించి పోయినట్లు తప్పుడు క్లెయిమ్‌లకు దరఖాస్తు చేసే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇంటిలోని వస్తువులకు బీమా రక్షణ కల్పించేటప్పుడు ఆ ఇంటికి ఉండే భద్రత వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే 50 ఏళ్ళు దాటిన ఇంటికి, పదేళ్ళు దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా రక్షణను ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఇంటిలో బంగార వస్తువుల విషయానికి వస్తే.. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు. కానీ ఈ ప్రీమియం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాదాపు అన్ని నాన్‌లైఫ్ (సాధారణ) బీమా కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. అద్దె ఇంట్లో ఉంటున్న వారు కేవలం కంటెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రభుత్వ రంగ కంపెనీలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్, నేషనల్, యునెటైడ్ ఇండియా కంపెనీలతోపాటు ఇఫ్కో టోక్యో, ఐసీసీఐ లాంబార్డ్, టాటాఏఐజీ, బజాజ్ అలయంజ్ వంటి కంపెనీలు దీన్ని అందిస్తున్నాయి. ఇంటి విలువను ఎలా లెక్కిస్తారు? ఇంటి విలువను లెక్కించడంలో స్థలం విలువను పరిగణనలోకి తీసుకోరు. అలాగే బహిరంగ మార్కెట్లో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు లేదా ఇప్పుడున్న ఇంటిని కూల్చి తిరిగి నిర్మించాలంటే ఎంత వ్యయం అవుతుందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ ఇంటిని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో(బిల్డప్ ఏరియా) నిర్మించారనుకుందాం. ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకి రూ.1200లు అయితే అప్పుడు మీ ఇంటి విలువ రూ. 12,00,000 అవుతుంది. అంటే గరిష్టంగా రూ.12 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
‘వాణిజ్యం’ కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో నగరంలో ఎంతలేదన్నా 2 కోట్ల చ.అ. విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఫ్లాట్లపై 2 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వాణిజ్య స్థలాల్లో పెట్టుబడికి పరిశీలించాల్సిన అంశాలేమిటో చూద్దాం. వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో పెట్టుబడి పెట్టాలి. వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారమున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. ఇవే కీలకం.. ► ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. ► భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ► వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెంద డానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగడానికి ఆస్కారముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి. ► కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి. ► నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.