ఇండియాలో భారీ పెట్టుబడులు | Tim Cook: iPhone sales will grow again but investors don't believe | Sakshi
Sakshi News home page

ఇండియాలో భారీ పెట్టుబడులు

Jan 28 2016 1:02 AM | Updated on Sep 3 2017 4:25 PM

ఇండియాలో భారీ పెట్టుబడులు

ఇండియాలో భారీ పెట్టుబడులు

భారత్‌లో రానున్న కాలంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు.

అక్కడ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టే
ఐఫోన్‌కు మున్ముందు
అదే పెద్ద మార్కెట్: టిమ్ కుక్

న్యూయార్క్: భారత్‌లో రానున్న కాలంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్ దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు. ‘‘ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ ఉంది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా ఉంది. అందుకే మేం ఆ దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీర్ఘకాలంలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం’’ అని వివరించారు. భారత్ మంచి వృద్ధి రేటు నమోదు చేస్తోందంటూ... చైనా, అమెరికా తర్వాత మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్కడే ఉందన్నారు. చైనా మార్కెట్‌తో పోలిస్తే.. భారత్ జనాభాలో దాదాపు సగం మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపారు. చైనాలో యువ జనాభా వయసు సగటున 37 ఏళ్లుగా ఉంటే, ఇండియాలో 27 ఏళ్లుగా ఉందన్నారు.

74.8 మిలియన్ల ఐఫోన్ విక్రయాలు...
డిసెంబర్ 26తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఐఫోన్ విక్రయాలు 74.8 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఐఫోన్ విక్రయాలు 74.5 మిలియన్ యూనిట్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఐఫోన్ బ్రాండ్ విక్రయాలు ప్రారంభమైనప్పటి (2007) నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి వృద్ధి అని టిమ్ కుక్ తెలియజేశారు. భారత్‌లో ఐఫోన్ విక్రయాలు వృద్ధి 76 శాతంగా నమోదయిందన్నారు.

 అలాగే ఇండియాలో ఆదాయం కూడా 38 శాతం పెరిగిందన్నారు. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర ఆదాయం 2 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాగా ఇటీవల యాపిల్ కంపెనీ భారత్‌లో రిటైల్ ఔట్‌లెట్స్ ఏర్పాటు కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)కి దరఖాస్తు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement