ఇలాగైతే పెట్టు‘బడి’లో ఫస్ట్‌క్లాస్‌!

ఇలాగైతే పెట్టు‘బడి’లో ఫస్ట్‌క్లాస్‌!


లక్ష్యంలో స్పష్టత.. పెట్టుబడుల్లో వైవిధ్యత

క్రమానుగతంగా పనితీరు మదింపు

పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు

ఆర్జన ప్రారంభమైనప్పటి నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌

అవసరం మేరకు నిపుణుల సేవలు 
 ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే...? పెట్టుబడులు పెట్టడమేగా అని చాలా మంది అనుకోవచ్చు. ఇటుక, ఇసుక, సిమెంటు ఉంటే ఇల్లు రెడీ

అయిపోతుందా...? దానికి కొలతలు, కార్మికులు, నిపుణులు, ఇంజనీర్లు ఇలా ఎంతో మంది నిపుణులు... ఎన్నో రకాల మెటీరియల్‌ కలిస్తే కానీ అందమైన ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు.
ఇన్వెస్ట్‌మెంట్‌

సంపదగా మారాలంటే ఇలానే ఎన్నో అంశాలుంటాయి. ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, సమయానుకూలంగా సరైన నిర్ణయాలు

తీసుకుంటూ, సరైన దిశలో పెట్టుబడులను కొనసాగించడం ద్వారానే జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణులు చెబుతున్న ఆ కిటుకులే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం.లక్ష్యం కావాలి

దేనికైనా లక్ష్యం అన్నది ఒకటుండాలి. అందులో ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. లక్ష్యం భవిష్యత్తు అవసరాలే అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప కాల అవసరాలు అయితే స్థిరమైన రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా మదుపు కొనసాగనప్పుడు అవసరాలకు తగిన నిధి సమకూరడం కష్టతరమవుతుంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.ముందు నుంచే...

పెట్టుబడులు అన్నవి ఆర్జనతోపాటే ప్రారంభం కావాలి. ఎంత ముందుగా మొదలైతే అవసరాలకు కావాల్సిన నిధిని అంత సులభంగా సమకూర్చుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రణాళికల విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ విజయవంతం అవుతుంది. పెట్టుబడులు అవసరాలను తీర్చేలా ఉండాలి. అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉండాలి. అధిక రిస్క్‌ పనికిరాదు.వేచి ఉండడం సరికాదు...

పెట్టుబడి పెట్టేందుకు సమయం కోసం వేచి చూడకూడదు. క్రమానుగతంగా పెట్టుబడి పెడుతూ వెళ్లడమే ఇన్వెస్టర్‌గా చేయాల్సింది. మార్కెట్‌ దిగువ స్థాయికి వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టాలని కాచుక్కూర్చుంటే... అది ఎప్పుడు వస్తుంది...? ఏ స్థాయిలో స్థిరపడుతుందన్నది? గుర్తించలేకపోవచ్చు. గుర్తించేలోపే తిరిగి ధరలు పెరిగిపోవచ్చు. అదే సమయంలో గరిష్ట స్థాయిలోనే విక్రయించాలనుకోవడం కూడా అవగాహన రాహిత్యమే అవుతుంది. ఎందుకంటే ఇది గరిష్ట స్థాయి అని గుర్తించడం అన్ని వేళలా సాధ్యం కాదు? అందుకే క్రమానుగతంగా విక్రయించడం మొదలు పెట్టాలి.దీర్ఘకాల పనితీరు ఆధారంగా...

చక్కని పనితీరున్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన సరైనదే. కానీ, ఇందుకు గతేడాది కాలంలో అత్యుత్తమ పనితీరు చూపిన వాటిని ఎంచుకోకుండా ఐదేళ్లు, పదేళ్లు ఇలా దీర్ఘకాల పనితీరును పెట్టుబడులకు ప్రాథమిక సూత్రంగా తీసుకోవాలి. అప్పుడే నమ్మకమైన రాబడులకు అవకాశం ఉంటుంది.ఒక్క అంశానికే పరిమితం కారాదు

పెట్టుబడికి షేర్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇలా ఎంపిక ఏదైనా కానీయండి. కేవలం ఏదో ఒక అంశానికి పరిమితమై ఫలానా దానిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడం తప్పటడుగే అవుతుంది. ఉదాహరణకు అధిక వడ్డీ రేటు వస్తుందని కంపెనీ డిబెంచర్‌ కొనుగోలు చేశారనుకుందాం. కానీ, అవసరమైనప్పడు నగదుగా మార్చుకునే సౌలభ్యత తక్కువగా ఉంటుంది. పైగా డిబెంచర్‌ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యే పరిస్థితీ రావచ్చు. రాబడి హెచ్చుగా ఉంటుందని షేర్‌లో మదుపు చేశారనుకుందాం. దాని పనితీరు మార్కెట్‌ ఆటుపోట్లు, కంపెనీ యాజమాన్యం నిర్వహణ ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే కాల వ్యవధి, ఆశిస్తున్న రాబడి, రిస్క్‌ సామర్థ్యం ఇలా ఎన్నో అంశాలనూ పరిశీలించిన తర్వాతే తగిన సాధనాలను ఎంచుకోవాలి.డైవర్సిఫికేషన్‌ అవసరమే కానీ...

పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకటే అస్సెట్‌ క్లాస్‌లో పెట్టరాదు. చాలా మందికి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం అలవాటు. ఇందులో 6–7 శాతం మించి రాబడులు రావు. పెట్టుబడంతా తీసుకెళ్లి డెట్‌ మార్కెట్లో పెడితే, ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో ఉన్న అవకాశాల ప్రయోజనాలను అందుకోలేరు. అందుకే పెట్టుబడుల్లో వైవిధ్యం (డైవర్సిఫికేషన్‌) అవసరం. అది కూడా అవసరమైనంతే. స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, ఇలా లెక్కకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు డైవర్సిఫికేషన్‌ ఎక్కువైనట్టే. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొంత పెట్టుబడులు పెట్టి, అదే సమయంలో బ్లూచిప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ పెట్టుబడి పెడితే అది డూప్లికేషన్‌ అవుతుంది. ఇలా లేకుండా చూసుకోవాలి. పెట్టుబడులకు వైవిధ్యం అవసరం కదా అని ఎక్కువ వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తే... వాటి పనితీ రును ట్రాక్‌ చేయడం కష్టతరమవుతుంది. ఇక పెట్టుబడుల్లో భిన్నత్వం అన్నది ప్రతీ విభాగంలోనూ ఉండాలి. ఉదాహరణకు ఈక్విటీల్లో పెట్టుబడులన్నవి లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్, మల్టీ క్యాప్‌ ఇలా అన్నమాట. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఈ తరహా డైవర్సిఫైడ్‌ పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి.సమీక్ష... మార్పులు

లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌ చేయడమే కాదు... వాటిని మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. మీ పెట్టుబడులపై తగిన ప్రతిఫలం వస్తోందా..? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే తగిన మార్పులు, చేర్పులు చేసుకోవడం, వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే లక్ష్యాలు రిస్క్‌లో పడతాయి. ఉదాహరణకు ఈక్విటీ, డెట్, కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. కొంతకాలానికి అధిక రాబడుల కారణంగా మీ మొత్తం ఆస్తుల విలువ ఈక్విటీల్లోనే అధిక స్థాయికి చేరిందనుకోండి. అప్పుడు రిస్క్‌ స్థాయి ఎక్కువైనట్టే. అప్పుడు కొంత ఈక్విటీ నుంచి డెట్‌ సాధనాలకు మళ్లించడం ద్వారా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఇలా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో రిస్క్‌ తగ్గించుకోవడమే కాకుండా రాబడుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో రాబడుల విషయంలో పేలవ పనితీరుతో ఉన్న వాటిని వదిలించుకునేందుకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మీకు కష్టం అనుకుంటే ఆర్థిక సలహాదారుల సేవలు పొందాలి.నిర్లక్ష్యం తగదు

పెట్టుబడుల విషయంలో శ్రద్ధ లేకపోవడం చాలా మందిలో కనిపించే అంశం. కొంత మంది తమ పొదుపు నిధులను నిర్లక్ష్యంగా తక్కువ రాబడులిచ్చే సేవింగ్స్‌ ఖాతాల్లోనే ఉంచేస్తుంటారు. మీ దగ్గర ఒక నెల అవసరాలకే నగదు రూపంలో ఉండాలి. పెట్టుబడులను ఎప్పుడూ వాయిదా వేయరాదు. దీనివల్ల పొదుపు సంపదగా మారడం కలే అవుతుంది. కష్టార్జితం అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. సరైన పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకుని ఆటోమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ ద్వారా పొదుపు నిధులను పెట్టుబడులకు మళ్లించే ఏర్పాటు చేసుకోవాలి.అవసరానికి తీసుకున్నా...

దీర్ఘకాల అవసరాల కోసం కొనసాగుతున్న పెట్టుబడులు మధ్య మధ్యలో అనూహ్యంగా ఎదురయ్యే అవసరాలకు బలి కాకుండా చూసుకోవాలి. అనుకోకుండా వచ్చే అవసరాలను అధిగమించేందుకు కొందరు ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి రుణం తీసుకోవడం, బీమా పాలసీపై రుణం పొందడం చేస్తుంటారు. అత్యవసరమైతే ఇలా తీసుకోవడం కొంత వరకు సరైనదే. కానీ, ఇలా తీసుకున్న వాటిని వీలైనంత వెంటనే తిరిగి చెల్లించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అసలు ఆ పెట్టుబడి ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టామో అది దెబ్బతింటుంది. కొంతమంది తమ పెట్టుబడే కదా, నిదానంగా తీర్చేయవచ్చులే అనుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ పెట్టుబడిపై వచ్చే రాబడి తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీ రూపంలో ఆవిరైపోతుంది. అందుకే స్వల్పకాలిక అవసరాలకు కూడా కొంత నిధిని ప్లాన్‌ చేసుకోవడం అవసరం. ఇక భావోద్వేగాలు పెట్టుబడులను శాసించకుండా జాగ్రత్తపడాలి.      పెట్టుబడుల మళ్లింపు

లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు చివర్లో ముందు నుంచే వాటిని ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు పిల్లల వివాహం కోసం పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. వివాహం నిశ్చయమైన తర్వాత వాటిని ఉపసంహరించుకుంటామంటే ఆ సమయంలో స్టాక్‌ మార్కెట్లు క్షీణతలో ఉండొచ్చు. దీనివల్ల రాబడుల ప్రతిఫలాన్ని కొంత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఓ ఏడాది ముందు నుంచే నెలనెలా కొంత చొప్పున ఉపసంహరించుకుంటూ షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్, లిక్విడ్‌ ఫండ్స్‌కు మళ్లించాలి. దానివల్ల చివరి నిమిషంలో ఆటుపోట్ల ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top