
న్యూఢిల్లీ: బకాయిల ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను కొనుగోలు చేయడానికి ఒక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాన్ని కేంద్రం ప్రకటించింది. దివాలా ప్రొసీడింగ్స్‌లో కంపెనీల కొనుగోలు విషయంలో పన్ను రాయితీలను కల్పించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది.
మినిమం ఆల్ట్రర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ)కు సంబంధించిన రాయితీ విషయంలో ఆదాయపు పన్ను చట్టంలో తగిన సవరణలు తీసుకువస్తారు. ఇందుకు సంబంధించి 2018–19 బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. 2016 డిసెంబర్ నుంచీ అమల్లోకి వచ్చిన ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
హైబ్రిడ్ ఇనుస్ట్రుమెంట్లకు ప్రత్యేక పాలసీ
హైబ్రిడ్ ఇనుస్ట్రుమెంట్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్టు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు సహా పలు కీలక విభాగాల్లో విదేశీ నిధుల ఆకర్షణకు ఇవి సరైనవని మంత్రి పేర్కొన్నారు.
కంపెనీలు ఐటీ రిటర్నులు వేయకుంటే ప్రాసిక్యూషన్
ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయడంలో విఫలమయ్యే కంపెనీలు ఇకపై ప్రాసిక్యూషన్ చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో కేంద్రం సవరణలు చేయనుంది. అక్రమ మార్గాల్లో నిధులు మళ్లించడాన్ని నిరోధించే దిశగా డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్ల బలోపేతం
దేశంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్ల వ్యవస్థల బలోపేతానికి అదనపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నవ్యతకు, ప్రత్యేకమైన అభివృద్ధికి ఇవి అవసరమన్నారు. ‘‘విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాం. స్టార్టప్ ఇండియా కార్యక్రమం చేపట్టాం. ప్రత్యామ్నాయ పెట్టుబడుల విధానాన్ని ప్రవేశపెట్టాం’’ అని అన్నారు.
స్పెక్యులేషన్ పరిధి నుంచి అగ్రి డెరివేటివ్స్ తొలగింపు
అగ్రి–కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో హెడ్జింగ్‌ను మరింతగా ప్రోత్సహించే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. అగ్రి–కమోడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను ’నాన్–స్పెక్యులేటివ్’ గా వ్యవహరించేలా సంబంధిత చట్టాన్ని సవరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (సీటీటీ) వర్తించే కమోడిటీ డెరివేటివ్స్ లావాదేవీలన్నింటినీ నాన్–స్పెక్యులేటివ్‌గా పరిగణిస్తున్నారు.
అయితే, అగ్రి–కమోడిటీలకు సీటీటీ నుంచి మినహాయింపు ఉండగా, వాటి డెరివేటివ్స్‌లో నిర్వహించే ట్రేడింగ్‌ను మాత్రం స్పెక్యులేషన్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా మంది అగ్రి–డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌కు దూరంగా ఉంటున్నారని .. తాజా మార్పుతో ప్రాసెసింగ్ సంస్థలు, తయారీ సంస్థలు ఇకపై వీటిపై దృష్టి సారించగలవని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డీకే అగర్వాల్ తెలిపారు. అగ్రి–డెరివేటివ్స్‌లో వచ్చే లాభాలను వ్యాపార ఆదాయం లేదా నష్టంగా పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు.