టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

Tata Steel Profits 3302 Crore - Sakshi

క్యూ2లో 6 శాతం వృద్ధి

రూ.34,763 కోట్లకుపడిపోయిన ఆదాయం

57% తగ్గిన దేశీ నిర్వహణ లాభం

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763 కోట్లకు తగ్గిందని పేర్కొంది. భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యాపార వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉందని, ఉక్కు ధరలపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ టీవీ నరేంద్రన్‌ వ్యాఖ్యానించారు. వర్షాలు ముగియడం, పండుగల డిమాండ్‌ కారణంగా వినియోగం ఊపందుకొని, ఉక్కుకు డిమాండ్‌ పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 

100 డాలర్ల మేర తగ్గిన ఉక్కు ధరలు...
కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా కంపెనీకి రూ.4,233 కోట్ల పన్ను వ్యయాలు(దేశీ, విదేశీ అనుబంధ కంపెనీలను కలుపుకొని) తగ్గాయి. వ్యాపార పరిస్థితులు గడ్డుగా ఉండటంతో ఉక్కు ధరలు ప్రపంచవ్యాప్తంగా టన్నుకు వంద డాలర్లు తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నిర్వహణ లాభం రూ.4,018 కోట్లుగా ఉంది. భారత కార్యకలాపాల విషయానికొస్తే, నిర్వహణ లాభం 57 శాతం పతనమై  రూ.3,817 కోట్లకు చేరింది.  నిర్వహణ లాభ మార్జిన్‌ 18.9 శాతంగా నమోదైంది. 

పెరిగిన రుణ భారం...
వర్కింగ్‌ క్యాపిటల్‌ పెరగడంతో కంపెనీ స్థూల రుణభారం మరింతగా పెరిగింది. ఈ క్యూ2లో విదేశాల్లో 52.5 కోట్ల డాలర్ల రుణాలను సమీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ. 4,596 కోట్ల నగదు నిల్వలు, రూ.7,262 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లు ఉన్నాయి. టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌(గతంలో భూషణ్‌ స్టీల్‌) విలీన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఈ విలీనం పూర్తి కానున్నది. మందగమనం ఉన్నప్పటికీ, బ్రాండెడ్‌ ఉత్పత్తులు, రిటైల్‌ సెగ్మెంట్, పారిశ్రామిక, ప్రాజెక్ట్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలనే సాధించామని కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది. వాహన రంగం మందగమనం ప్రభావాన్ని ఎగుమతులు పెరగడం సర్దుబాటు చేయగలిగిందని కంపెనీ పేర్కొంది.  మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేర్‌ స్వల్ప లాభంతో రూ.404 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top