భారత్‌ వృద్ధికి ఢోకా లేదు!

Standard & Poor reaffirms India is sovereign rating at BBB - Sakshi

ఎస్‌అండ్‌పీ అంచనా

ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషణ

స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’సావరిన్‌ రేటింగ్‌ కొనసాగింపు

2020–21లో 6% వృద్ధికి అవకాశం

ఆపై రెండేళ్లలో మరింత జోరు

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతున్నా... దేశ ఆర్థిక మూలాల పటిష్టతపై విశ్వాసాన్ని గ్లోబల్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థ– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే,  భారత్‌ ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2020–2021లో దేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనావేసింది.

2021–2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్‌ సూచిస్తుంది. ఎస్‌అండ్‌పీ ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను చూస్తే...
     
► ఇటీవలి త్రైమాసికాల్లో భారత్‌ ఆర్థిక వృద్ధి బలహీన ధోరణిని ప్రదర్శిస్తోంది. అయితే దేశ వ్యవస్థాగత వృద్ధి పనితీరు పటిష్టంగా, చెక్కుచెదరకుండా ఉంది. దీనివల్ల వాస్తవిక (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని) జీడీపీ వృద్ధి క్రమంగా రెండు మూడేళ్లలో రికవరీ చెందుతుందని భావిస్తున్నాం.  
     
► తోటి వర్థమాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచూస్తే, భారత్‌ ఆర్థిక వ్యవస్థ పనితీరు రానున్న కాలంలో మెరుగ్గానే కొనసాగుతుంది.  
     
► తగిన ద్రవ్య, పరపతి విధానాలు, సైక్లికల్‌ ఫ్యాక్టర్స్‌ (తప్పనిసరిగా తిరిగి మెరుగుపడే కొన్ని అంశాలు), సానుకూల వ్యవస్థాగత అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడతాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉండడం ఇక్కడ గమనార్హం.  
     
► జనాభాలో యువత అధికంగా ఉండడం, పోటీపూర్వక  కార్మిక వ్యయాలు, సానుకూల కార్పొరేట్‌ పన్ను విధానాల వంటి అంశాలను వ్యవస్థాగతంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనవిగా పేర్కొనవచ్చు.  
     
2020–2024లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు సగటు 7.1 శాతంగా ఉంటుందన్నది విశ్లేషణ.  
     
► అయితే భారత్‌ ద్రవ్య పరిస్థితులు ఇంకా కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా ద్రవ్యలోటు ప్రభుత్వ ప్రణాళికలను దాటిపోయింది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దీని కట్టడి కొంత పరిమితంగానే ఉండే వీలుంది. అయితే ఆయా అంశాల్లో భారత్‌ పురోగతి సాధించగలిగితే, రేటింగ్‌ పెరిగే అవకాశాలూ ఉంటాయి. వృద్ధి, ద్రవ్యలోటు వంటి అంశాల్లో తన అంచనాలు విఫలమైతే, రేటింగ్‌ మరింత కోతకు కూడా వీలుంటుంది.  
     
► నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల బలహీన పరిస్థితులు వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేటు వినియోగాన్ని కట్టడి చేసే వీలుంది.  
     
► జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం– 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 5 శాతం. అయితే 2020–21లో ఈ రేటు 6 శాతంగా ఉండే వీలుందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. దీనికి సరిసమానంగా ఎస్‌అండ్‌పీ అంచనాలు కూడా ఉండడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top