గ్రీన్‌కార్డు కోసం 151 సంవత్సరాలు వేచిచూడాలా...?!

Some Indians May Have To Wait 151 Years For Green Card - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. వారి కలలకు ఇటీవల ట్రంప్‌ సర్కార్‌ కళ్లెం వేస్తూ వస్తోంది. అంతేకాక అక్కడికి వెళ్లి, గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు పొందే గ్రీన్‌ కార్డు కోసం భారతీయులు 150 ఏళ్లకు పైన వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పరుడుతోంది. అడ్వాన్స్‌ డిగ్రీలు కలిగి ఉన్నప్పటికీ 150 సంవత్సరాలకు పైగా వేచిచూడాల్సి వస్తుందని తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ గణాంకాలను వెల్లడించింది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌(యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసిన అనంతరం కాటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ గణాంకాలను రిలీజ్‌చేసింది. ఈ గణాంకాలు 2017లో గ్రీన్‌కార్డు జారీని అనుసరించి ఉన్నాయి. 2018 ఏప్రిల్‌ 20 వరకు 632,219 మంది భారతీయ వలసదారులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్‌ పిల్లలు గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్నారని పేర్కొంది. ఈ కార్డునే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు న్యాయబద్దమైనదిగా భావిస్తారు. 

ఎవరైతే అడ్వాన్స్‌ డిగ్రీలు కలిగి ఉన్నారో అంటే ఈబీ-2 వర్కర్ల పరిస్థితే దారుణంగా ఉందని కాటో ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఈ కేటగిరీ భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం 151 ఏళ్ల వరకు వేచిచూడాల్సి వస్తుందని, ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందని కాటో ఇన్ స్టిట్యూట్‌ సూచించింది. ఒకవేళ చట్టంలో కనుక మార్పులు తీసుకురాకపోతే, వారికి గ్రీన్‌ కార్డు వచ్చే సరికి వారు చనిపోవడమో లేదా ఎక్కడికైనా వెళ్లిపోవడమో జరుగుతుందని పేర్కొంది. యూఎస్‌సీఐఎస్‌ ప్రకారం ఈబీ-2 కేటగిరీ కింద 2,16,684 మంది భారతీయ దరఖాస్తుదారులున్నారు. వారి జీవిత భాగస్వాములు, పిల్లల్ని తీసుకుంటే, మొత్తంగా 4,333,368 మంది ఉన్నట్టు తెలిసింది.  

అయితే  అత్యధిక నైపుణ్యమున్న కేటగిరీకి చెందిన ఈబీ-1 వలసదారులు ఈ కార్డుల కోసం కాస్త తక్కువ సమయమే వేచిచూడాల్సి వస్తుందని కాటో ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం పేర్కొంది. అసాధారణ ప్రతిభ కలిగిన వలసదారులకు కేవలం ఆరు సంవత్సరాలే పడుతుందని చెప్పింది. ఇక ఈబీ-3 కేటగిరీ వలసదారులైతే గ్రీన్‌కార్డు కోసం 17 సంవత్సరాలు వేచిచూస్తున్నారని కాటో ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఏప్రిల్‌ 20 వరకు ఈ కేటగిరీ కింద 54,892 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 60,381 మంది జీవిత భాగస్వాములు, పిల్లలను కలుపుకుంటే, మొత్తంగా 1,15,273 మంది భారతీయులు ఈ కేటగిరీలో గ్రీన్‌కార్డు పొందేందుకు వేచి ఉన్నారని కాటో ఇన్‌స్టిట్యూట్‌ రిపోర్టు వెల్లడించింది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top