సెబీ ‘స్మార్ట్‌’ నిర్ణయాలు | Sebi may ask mutual funds to reduce exposure to unrated debt | Sakshi
Sakshi News home page

సెబీ ‘స్మార్ట్‌’ నిర్ణయాలు

Aug 22 2019 5:42 AM | Updated on Aug 22 2019 5:42 AM

Sebi may ask mutual funds to reduce exposure to unrated debt - Sakshi

ముంబై: స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్‌ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్‌ ఫైనాన్స్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది.  రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్‌ ఏజెన్సీలకు లిస్టెడ్‌ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్‌   పలు నిర్ణయాలు
తీసుకుంది. వివరాలు..

► ఎఫ్‌పీఐల నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) నిబం ధనలు  మరింత సరళతరమయ్యాయి.  

► స్మార్ట్‌ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో  నమోదైన సంస్థలు మునిసిపల్‌ బాండ్లతో నిధులు సమీకరించవచ్చు.  

► ప్రస్తుతం స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫార్మ్‌పై నమోదైన స్టార్టప్‌లు ఇక నుంచి స్టాక్‌ సూచీలకు మారవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.  

► ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు (విజిల్‌ బ్లోయర్స్‌) రూ.కోటి దాకా నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు.  

 

► కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్‌ల్లో 25%కి మించకుండా బైబ్యాక్‌ ఆఫర్‌ ఉండాలి. ఈ ఆఫర్‌ 10%కి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి  ఉంటుంది.

► లిస్టింగైన లేదా లిస్టింగ్‌ కాబోతున్న ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లోనే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది. అంతేకాకుండా రేటింగ్‌ లేని డెట్‌ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే పెట్టుబడులను 5 శాతానికే పరిమితం చేయాలని కూడా సూచించింది.

► డెట్‌ పోర్ట్‌ఫోలియో స్కీమ్‌లు లిస్టింగ్‌ కాని ఎన్‌సీడీల్లో గరిష్టంగా 10 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు.

► రేటింగ్‌ లేని డెట్‌ సాధనాల్లో డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇంట్రెస్ట్‌ రేట్‌ స్వాప్స్, ఇంట్రెస్ట్‌ రేట్‌ ఫ్యూచర్స్, రెపో ఆన్‌ జీ–సెక్, ట్రెజరీ బిల్లులను మినహాయిస్తే, కొన్ని మాత్రమే ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌
ఫండ్స్‌కు మిగులుతాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బిల్స్‌ రీ–డిస్కౌంటింగ్‌(బీఆర్‌డీఎస్‌), మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు, రెపో ఆన్‌ కార్పొరేట్‌ బాండ్స్, రీట్స్‌/ఇన్విట్స్‌ యూనిట్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► లిస్టైన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25% నుంచి 35%కి పెంచాలన్న ప్రతిపాదనకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉందని సెబీ పేర్కొంది.  అయితే లిస్టైన ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 శాతం వరకూ ఇప్పటికీ, 25 శాతం నిబంధనను అందుకోలేకపోయాయి. అందుకని 35 శాతం పబ్లిక్‌ హోల్డింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింతగా మదింపు చేయాల్సి ఉందని సెబీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement