రుణం వైపు కాదు... స్టాక్‌ మార్కెట్‌ వంక చూడాలి!

రుణం వైపు కాదు... స్టాక్‌ మార్కెట్‌ వంక చూడాలి!


నిధుల సమీకరణపై చిన్న పరిశ్రమలకు ఎస్‌బీఐ చీఫ్‌ సూచన  

న్యూఢిల్లీ:
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ) తమకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్టాక్‌ మార్కెట్లకు వెళ్లాలి తప్ప, రుణ ఆధారితాలు కారాదని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య సూచించారు.  ఆయా సంస్థలు తమ వ్యాపారాన్ని ఆరోగ్యవంతమైన రీతిన నిర్వహించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.  చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...  



చిన్న తరహా పరిశ్రమలు తమ వ్యాపార తొలి దశల్లో నిధుల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్నాయి. ఇది ఆయా సంస్థల బ్యాలెన్స్‌ షీట్లపై ప్రభావం చూపుతోంది.  

మన దేశానికి సంబంధించినంతవరకూ చిన్న పరిశ్రమలు తమ నిధుల అవసరాలకు స్టాక్‌ మార్కెట్‌ వైపు చూడవు. ఈక్విటీ ఆధారిత మూలధనం సమకూర్చుకునే అంశం పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోంది.  

టెక్నాలజీ సంస్థల నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. వాటి వ్యాపార అవసరాలకు కావాల్సిన మొత్తంలో అధిక భాగాన్ని ఆయా సంస్థలు ఈక్విటీ విధానం ద్వారానే సమీకరించుకుంటాయి.  

మనం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ–కామర్స్‌ కంపెనీలనూ చూడొచ్చు. ఈక్విటీతో ఆయా కంపెనీలు అద్భుతాలను సృష్టించాయి.  

చిన్న తరహా పరిశ్రమలకు ఈక్విటీ సాయాన్ని అందించగలిగిన పెట్టుబడిదారులు ఉన్నారు.  మీ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభం వస్తుందన్న విశ్వాసాన్ని కల్పించడం ముఖ్యం.  

చాలా మంది చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు  తొలుత తన కుటుంబం, స్నేహితులు, బంధువుల నుంచి సమీకరించిన నిధులతో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తరువాత, బ్యాంకులపై ఆధారపడతారు తప్ప, ఈక్విటీవైపు మాత్రం చూడరు.  



చిన్న పరిశ్రమలకు దివాలా ఫ్రేమ్‌వర్క్‌: సాహూ

కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఎంఎస్‌ సాహూ మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఇన్‌సాల్వెన్సీ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ దాదాపు కార్పొరేట్‌ దివాలా వ్యవహారాలను చక్కదిద్దడానికి ఉద్దేశించినది ఉందన్నారు. అందువల్ల చిన్న తరహా పరిశ్రమలకు రెండు దశల్లో సమగ్ర దివాలా పక్రియ విధివిధానాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top