రిలయన్స్‌- బీపీ జాయింట్‌ వెంచర్‌ లాంచ్‌

RILBP launch fuel and mobility joint venture - Sakshi

రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) పేరుతో తక్షణమే సేవలు 

త్వరలోజియో-బీపీగా రీ బ్రాండింగ్‌

సాక్షి, ముంబై:ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌​) ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ (బీపీ) భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ ను లాంచ్‌ చేసింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్)  పేరుతో దీన్ని ప్రారంభించినట్లు  గురువారం  ప్రకటించింది.

గత ఆగస్టులోనే జాయింట్ వెంచర్ కంపెనీ రూపొందించే ప్రణాళికను రిలయన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కంపెనీలో 51శాతం రిలయన్స్‌ సొంతం కాగా, మిగిలిన 49 శాతం వాటా బీపీ యాజమాన్యంలో ఉంటుంది. ఇందుకు ఏడు వేల కోట్ల రూపాయలను బీపీ చెల్లించనుందని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రవాణా ఇంధనాల మార్కెటింగ్‌కు  అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలను ఆర్‌బీఎంఎల్ సాధించిందనీ ప్రస్తుత రిటైల్ అవులెట్లో సేవలు తక్షణమే అమలు చేయడం ప్రారంభిస్తుందని తెలిపింది.  త్వరలోనే దీన్ని “జియో-బిపి” గా మార్చనున్నామని రిలయన్స్‌ వెల్లడించింది.

ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశ ఇంధనాలు, మొబిలిటీ మార్కెట్లలో అగ్రభాగాన నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బీపీ తెలిపింది. 21 రాష్ట్రాలలో మిలియన్ల వినియోగదారుల ద్వారా రిలయన్స్ ఉనికిని మరింత పెంచుతుందని పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశమని బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ  వ్యాఖ్యానించారు.  

తాజా భాగస్వామ్యంతో ఆయిల్ మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్‌ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్‌ మరింత దూసుకెళ్తుందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు.  ఈ జాయింట్‌ వెంచర్‌ ద్వారా  రిటైల్, ఏవియేషన్ ఇంధనాలలో బీపీతో బలమైన, విలువైన భాగస్వామ్యకొనసాగుతుందన్నారు. అలాగే సర్వీస్‌ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య నాలుగు రెట్లు పెరగనుందని పేర్కొన్నారు. 20 వేల నుంచి  80వేల వరకు ఈ సంఖ్య  పెరుగుతుందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 30 నుండి 45 విమానాశ్రయాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉండగా, ఇపుడు మొత్తం 5,500 పెట్రోల్‌ బంకులను జాయింట్‌ వెంచర్‌ ద్వారా అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. వీటి ద్వారా ఇండియన్ కస్టమర్స్‌కు అధిక-నాణ్యత, తక్కువ కార్బన​ ఉద్గారాల విభిన్న ఇంధనాలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, ఇతర సేవలను అందించనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్  విమానయాన ఇంధన నెట్ వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానుంది. తాజా ఒప్పందంతో జియో- బీపీ బ్రాండ్ జాయింట్ వెంచర్ భారత్‌లో చమురు, మొబిలిటీ మార్కెట్‌లో లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. రాబోయే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్ అవుతుందని, దేశంలో కార్ల సంఖ్య  దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top