ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ చార్జీల రద్దు

RBI removes NEFT, RTGS payment charges to push digital transactions - Sakshi

ముంబై: డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్‌ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్‌బీఐ అమలుపరిచింది. ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్‌) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్‌టీజీఎస్‌ వినియోగంలో ఉంది.

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నెఫ్ట్‌ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్‌టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్‌ చేస్తోంది. డిజిటల్‌ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్‌ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్‌బీఐ స్పందించినట్టు లేదు.  

ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ
ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top