ఎండీఆర్‌పై శుభవార్త అందించిన ఆర్‌బీఐ

To promote cashless transactions, RBI reduces MDR charges for debit cards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిటక్రెడిట్‌  కార్డుల మర్చంట్‌ డిస్కౌంట్ల రేటు(ఎండీఆర్‌)పై ఆర్‌బీఐ పలు మార్పులు చేసింది.  డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎండీఆర్‌ చార్జీలను సవరించినట్టు తెలిపింది. ఈ సవరించిన రేట్లు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.  టర్నోవర్‌ ఆధారంగా  వ్యాపారులను వర్గీకరించి ఆ మేరకు చార్జీలను వసూలు చేయనుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, వినియోగదారులకు లాభం కలిగేలా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే క్యూఆర్‌ ఆధారిత లావాదేవీలకు కేంద్ర బ్యాంకు ఒక విభిన్న ఎండీఆర్‌ను కూడా రూపొందించింది.

చిరు వ్యాపారులు, చిన్న సంస్థలల్లో కూడా డెబిట్‌ కార్డ్‌ లావాదేవీలకు ప్రోత్సాహం, ఉనికిలో ఉన్న చిన్నవ్యాపారాలు, సంస్థల స్థిరత్వానికి భరోసా కల్పించడం అనే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సేవలపై వ్యాపారులకు బ్యాంకులు విధించే చార్జీలను పరిమితం చేస్తామని, వ్యాపారుల కేటగిరీ ఆధారంగా ఈ  చార్జీలను విధిస్తామని పేర్కొంది.  లావాదేవీ జరిగిన మొత్తం ఆధారంగా ఎండీఆర్ చార్జీలపై పరిమితులు విధిస్తామని వెల్లడించింది. క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతుల్లాగే అసెట్ లైట్ యాక్సెప్టెన్స్ వసతులను కల్పిస్తామని తెలిపింది.

తాజాగా సవరించిన రేట్ల ప్రకారంరూ. 20 లక్షల వరకూ టర్నోవర్ కలిగిన వ్యాపారుల ఎండీఆర్‌ రేటు 0.4 శాతంగా  నిర్ణయించింది. క్యూఆర్  కోడ్ ద్వారా లావాదేవి నిర్వహించినట్లయితే ఇది మరింత తగ్గి 0.3 శాతంగా ఉంటుందని తెలిపింది.  వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షలకు మించి వ్యాపారులకయితే  స్వైప్ మెషీన్ ఆధారిత లావాదేవీలకు 0.9 శాతం, క్యూఆర్ కోడ్ ఆధారిత అమ్మకాలకు 0.8 శాతం చార్జీని వసూలు చేస్తుంది.

కాగా గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఎండీఆర్‌ను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్‌బీఐ తాజాగా మరోసారి చార్జీలను తగ్గించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top