breaking news
cash less transactions
-
ఎండీఆర్‌పై శుభవార్త అందించిన ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిటక్రెడిట్ కార్డుల మర్చంట్ డిస్కౌంట్ల రేటు(ఎండీఆర్)పై ఆర్బీఐ పలు మార్పులు చేసింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎండీఆర్ చార్జీలను సవరించినట్టు తెలిపింది. ఈ సవరించిన రేట్లు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టర్నోవర్ ఆధారంగా వ్యాపారులను వర్గీకరించి ఆ మేరకు చార్జీలను వసూలు చేయనుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, వినియోగదారులకు లాభం కలిగేలా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే క్యూఆర్ ఆధారిత లావాదేవీలకు కేంద్ర బ్యాంకు ఒక విభిన్న ఎండీఆర్‌ను కూడా రూపొందించింది. చిరు వ్యాపారులు, చిన్న సంస్థలల్లో కూడా డెబిట్ కార్డ్ లావాదేవీలకు ప్రోత్సాహం, ఉనికిలో ఉన్న చిన్నవ్యాపారాలు, సంస్థల స్థిరత్వానికి భరోసా కల్పించడం అనే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సేవలపై వ్యాపారులకు బ్యాంకులు విధించే చార్జీలను పరిమితం చేస్తామని, వ్యాపారుల కేటగిరీ ఆధారంగా ఈ చార్జీలను విధిస్తామని పేర్కొంది. లావాదేవీ జరిగిన మొత్తం ఆధారంగా ఎండీఆర్ చార్జీలపై పరిమితులు విధిస్తామని వెల్లడించింది. క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతుల్లాగే అసెట్ లైట్ యాక్సెప్టెన్స్ వసతులను కల్పిస్తామని తెలిపింది. తాజాగా సవరించిన రేట్ల ప్రకారంరూ. 20 లక్షల వరకూ టర్నోవర్ కలిగిన వ్యాపారుల ఎండీఆర్ రేటు 0.4 శాతంగా నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవి నిర్వహించినట్లయితే ఇది మరింత తగ్గి 0.3 శాతంగా ఉంటుందని తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షలకు మించి వ్యాపారులకయితే స్వైప్ మెషీన్ ఆధారిత లావాదేవీలకు 0.9 శాతం, క్యూఆర్ కోడ్ ఆధారిత అమ్మకాలకు 0.8 శాతం చార్జీని వసూలు చేస్తుంది. కాగా గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఎండీఆర్‌ను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ తాజాగా మరోసారి చార్జీలను తగ్గించింది. -
నగదు రహిత లావాదేవీలు పెంపొందించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పెంపొందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బ్యాంక్ కరస్పాండెంట్లకు సూచించారు. గురువారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంక్ కరస్పాండెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 35 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. వాటిలో 4.50 లక్షల జనధన్ ఖాతాలు ఉన్నాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడిట్, డెబిట్, రూపే, జనధన్ కార్డులను ప్రజలు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాపారులు రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయవచ్చునని తెలిపారు. జిల్లాలోని 1890 చౌకదుకాణాల్లో నగదు రహిత పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని పింఛన్‌దారులు, ఉపాధి కూలీలను గుర్తించాలన్నారు. వారందరికీ డిసెంబర్ 1వ తేదీలోపు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జేసీ వ్యవసాయం, కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుపై సమీక్షించారు. సమావేశంలో ఏపీజీబీ ఆర్ఎం బీవీ శివయ్య, సీనియర్ మేనేజర్ ఎంఎస్ రామ్ పాల్గొన్నారు.