3500 ఉద్యోగులపై పిడుగు | Sakshi
Sakshi News home page

3500 ఉద్యోగులపై పిడుగు

Published Sat, Feb 24 2018 12:46 PM

PNB fraud accused Mehul Choksi letter to employees - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు, గీతాంజలి జెమ్స్‌   ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ  కూడా చేతులెత్తేశాడు.  మీకు జీతాలు చెల్లించలేను, వేరే ఉద్యోగాలు వెతుక్కోడంటూ ఉద్యోగుల నెత్తిన భారీ పిడుగు వేశాడు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు  ఒక లేఖ రాశాడు. దీంతో గీతాంజలి  జెమ్స్‌ లో పనిచేస్తున్న 3500మంది ఉద్యోగుల  జీవితాలు రోడ్డున పడ్డాయి. విధిని ఎదుర్కొంటా.. ఎలాంటి నేరమూ, తప్పూ చేయలేదు..ఎప్పటికైనా నిజం నిగ్గుతేలుతుందంటూ మెహుల్‌ రాసిన లేఖను న్యాయవాది సంజయ్‌ అబోట్‌ విడుదల చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల దాడులు, సృష్టించిన ఆందోళన కారణంగా తాను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు.  అంతేకాదు తన ఉద్యోగుల్లో  భయాన్ని, మానసిక ఒత్తిడిని సృష్టిస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చాడు.  

చోక్సీ లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు
నా పైన, మన సంస్థపైన  జరుగుతున్న అన్యాయమైన దాడి, భయాందోళన నేపథ్యంలో నేను  ఈ లేఖ రాస్తున్నారు. నిజమైన భారతీయ గౌరవానికి ప్రతీకగా నిజాయితీగా, సమగ్రతతో, కస్టమర్లకు సేవలందించే లక్ష్యంలో అనేక ఉత్థాన పతనాలను మనం  చూశాం.  కానీ   పీఎన్‌బీ స్కాంలో అరోపణలు, మీడియా అత్యుత్సాహం​తో అంతా తుడిచి పెట్టుకుపోయింది. రోజు రోజుకి పరిస్థితి ఘోరంగా పోతోంది. 

సంస్థను ఈ స్థితికి తీసుకురావడానికి మీరంతా ఎంత శ్రమించారో  నాకు తెలుసు. ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల దాడులు, సృష్టించిన ఆందోళన కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను.  రాజకీయ ప్రకటనలు నన్ను, నా కుటుంబ సభ్యులను తీవ్ర అభద్రతకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వివిధ బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో మీ బకాయిలు తీర్చడం, భవిష్యత్ జీతాలను చెల్లించటం, ఇప్పుడు నాకు చాలా కష్టం. 

మొదటగా, వేతనాల చెల్లింపు గురించి ఎలాంటి నిర్ధారణ లేదు, రెండోది, విద్యుత్,  నిర్వహణ ఛార్జీలు చెల్లించే పరిస్థితి గురించి కూడా చెప్పలేను. మూడవది, దర్యాప్తు సంస్థల అన్యాయమైన దర్యాప్తు కారణంగా  నాతో సంబంధం ఉన్న ఎవ్వరూ బాధపడకూదు.  అందుకే మరెక్కడైనా ఇతర కెరీర్ అవకాశాలను చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

ఆఫీసు నుంచి జారీ చేయబడిన ల్యాప్‌టాప్‌ / మొబైల్ ఫోన్లకు సంబంధించి గత బకాయిలను క్లియర్ చేసుకోగలిగితే మీరు కొనసాగించవచ్చు. పరిస్థితి చక్కబడిన తరువాత ఉద్యోగుల బకాయిలను తప్పకుండా చెల్లిస్తానని హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో సమస్యలన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నాను. ఆ సంతోష సమయంలో​ తిరిగి మనం అందరం కలిసి పనిచేద్దాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement