పేటీఎంలో బిగ్‌ ఛేంజ్‌ - యూజర్లు మండిపాటు

Paytm rolls back feature that turned wallet recharge via credit card into vouchers - Sakshi

డిజిటల్‌ వాలెట్‌గా ఎక్కువగా ప్రాముఖ్యం సంపాదించిన పేటీఎం, చడీచప్పుడు లేకుండా తన ప్లాట్‌ఫామ్‌పై అతిపెద్ద మార్పు చేపట్టింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా వాలెట్‌కు రీఛార్జ్‌ చేసుకునే మనీని గిఫ్ట్‌ ఓచర్లుగా మార్చేస్తోంది. అంటే పేటీఎం వాలెట్‌లోకి ఎవరైనా క్రెడిట్‌ కార్డు ద్వారా నగదును యాడ్‌ చేస్తే, ఈ నగదు వెంటనే గిఫ్ట్‌ ఓచర్లుగా మారిపోతాయి. వాటిని కేవలం పేటీఎం మాల్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదా రీఛార్జ్‌లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ నగదును బ్యాంకుకు లింక్‌ చేయడం కానీ, స్నేహితులకు ట్రాన్సఫర్‌ చేయడం కానీ ఇక నుంచి కుదరదు. దీంతో పేటీఎం యూజర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పరిమిత కాల వ్యవధిలో కంపెనీ దీన్ని లాంచ్‌ చేసిందని, ఈ కొత్త రూల్‌ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించిందని అవుట్‌లుక్‌ రిపోర్టు చేసింది.

పరిమిత కాల ట్రయల్స్‌ అయినా.. కనీసం సమాచారం లేకుండా పేటీఎం ఇలా చేయడం దారుణమంటున్నారు.  ట్విట్టర్‌ వేదికగా కంపెనీపై మండిపడుతున్నారు. క్రెడిట్‌ కార్డు వాడుతూ.. పేటీఎం వాలెట్‌లో ఎందుకు నగదు యాడ్‌ చేయాలి? పేటీఎం గిఫ్ట్‌ ఓచర్లు బలవంతంగా ఎందుకు కొనుగోలు చేపిస్తున్నారు? అసలేం జరుగుతోంది? ఈ పరిమితులు ఎందుకు? అంటూ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లను దోచుకోవడంలో ఇది మరో రకమైన పేటీఎం మోసమని అంటున్నారు. పాలసీలో మార్పులపై ఎలాంటి సమాచారం ఇ‍వ్వకపోవడంపై కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. సమాచారం లేకుండా పాలసీలో మార్పులు తీసుకురావడం అన్యాయమని అంటున్నారు.

ఈ ట్వీట్లపై స్పందించిన పేటీఎం ''హాయ్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా ఈ లావాదేవీ జరిపితే, అది పేటీఎం గిఫ్ట్‌ వాల్యుమ్‌లోకి యాడ్‌ అవుతుంది. ఈ నగదుతో పేటీఎం యాప్‌పై రీఛార్జ్‌ చేసుకోవచ్చు. పేటీఎం అంగీకరించే అవుట్‌లెట్లు, మెర్చంట్ల చెల్లింపులు వాడుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా పేటీఎం వాలెట్‌లోనే  నగదును యాడ్‌ చేయాలనుకుంటే, ఆ నగదును డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా యాడ్‌చేసుకోవచ్చు'' అని తెలిపింది.

అయితే పేటీఎం తన పాలసీని తాత్కాలికంగా మార్పు చేయడానికి ప్రధాన కారణం తన ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్‌ కార్డుల దుర్వినియోగమేనని తెలుస్తోంది. 0 శాతం ఫీజులతో పేటీఎం బ్యాంకు సేవలను అందిస్తోంది. చాలా మంది తమ క్రెడిట్‌ కార్డులను వాడుతూనే వాలెట్‌ రీఛార్జ్‌ చేస్తున్నారు. ఈ రీఛార్జ్‌తో నగదును బ్యాంకు అకౌంట్‌లోకి ట్రాన్సఫర్‌ చేయడం, విత్‌డ్రా చేయడం చేస్తున్నారు. అయితే ఒకవేళ క్రెడిట్‌ కార్డు ద్వారా డైరెక్ట్‌గా నగదును విత్‌డ్రా చేస్తే, బ్యాంకును బట్టి ట్రాన్సాక్షన్‌ ఫీజు 2-3 శాతం వసూలు చేస్తున్నారు. ఇలా ఎలాంటి ఫీజులు లేకపోవడంతో, పేటీఎంలో క్రెడిట్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top