బైక్‌ రైడ్‌ కావాలా?  అయితే ‘రాపిడో’..!! 

Ola and Uber model bike sharing app - Sakshi

ఓలా, ఉబర్‌ మాదిరి బైక్‌ షేరింగ్‌ యాప్‌

కి.మీ.కు రూ.3 చార్జీ; రోజుకు 40 వేల రైడ్స్‌

‘స్టార్టప్‌ డైరీ’తో రాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంక 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్‌ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్‌ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్‌ కరెక్ట్‌!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్‌ పూర్వ విద్యార్థుల త్రయం. ఓలా, ఉబర్‌లా మాదిరి బైక్‌ షేరింగ్‌ సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు రాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంక ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 

మాది విజయవాడ దగ్గర్లోని తిరువూరు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఫ్లిప్‌కార్ట్‌లో చేరా. సొంతగా కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచనతో ఐఐటీలో స్నేహితులైన పవన్‌ గుంటుపల్లి, రిషికేష్‌ ఎస్‌ఆర్‌లతో కలిసి 2015 నవంబర్‌లో బెంగళూరు కేంద్రంగా రాపిడోను ప్రారంభించాం. కస్టమర్ల రిజిస్ట్రేషన్‌ కోసం ట్రూ కాలర్‌తో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాక.. రిజిస్టర్‌ విత్‌ ట్రూకాలర్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే చాలు. మొబైల్‌ నంబర్, ప్రొఫైల్, ఓటీపీ ఏవీ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. రైడర్స్‌కు బీమా సౌకర్యం ఉంటుంది.

కస్టమర్‌ యాప్‌లో లాగిన్‌ అయి.. చేరాల్సిన గమ్యాన్ని ఎంట్రీ చేయగానే.. దగ్గర్లో అందుబాటులో ఉన్న బైక్‌లు కనిపిస్తాయి. డ్రైవర్‌ ప్రొఫైల్, ధర వస్తుంది. ఒకే చేయగానే రైడర్‌ రెండు హెల్మెట్లతో మీ దగ్గరికొస్తాడు. గమ్యస్థానాన్ని చేరుకున్నాక నగదు గానీ వ్యాలెట్‌ ద్వారా గానీ చెల్లింపులు చేయాలి. అంధులు, మానసిక వికలాంగుల కోసం రీడీమ్‌ ఫీచర్‌ను జోడించాం. గమ్యస్థానాన్ని వాయిస్‌ రూపంలో పలికితే అది టెక్ట్స్‌గా మారుతుంది. దీంతో పాటూ బ్యాంక్‌ ఖాతా అనుసంధానంతో వాలెట్‌ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి.  

ఏపీ, తెలంగాణల్లో 15 లక్షల రైడ్స్‌.. 
ప్రస్తుతం 15 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 4 లక్షల మంది. రోజుకు 40 వేల రైడ్స్‌. తెలుగు రాష్ట్రాల నుంచి 8 వేల వరకూ ఉంటాయి. నెలవారీ బైక్‌ పాస్‌ కూడా ఉంటుంది. నెలకు 50 ట్రిప్పులకు రూ.1,500 చార్జీ. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. ప్రతి రైడ్‌పై 15–20 శాతం డ్రైవర్‌ నుంచి కమిషన్‌ తీసుకుంటాం. 

జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులు.. 
ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ పలువురు వీసీలూ పాల్గొంటారు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top