చమురు మంట.. పసిడి పంట

Oil Prices Rise as Global Markets - Sakshi

దేశీయంగా జీవితకాల గరిష్టానికి బంగారం ధర

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అటు పసిడిని, ఇటు క్రూడ్‌ను అప్‌ట్రెండ్‌లోనే కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌– నైమెక్స్‌లో పసిడి ధర సోమవారం ఔన్స్‌ (31.1గ్రా) 1,588 డాలర్లను తాకింది. గత శుక్రవారం ముగింపుతో పోల్చితే ఇది 36 డాలర్లు అధికం. అయితే ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి 14 డాలర్ల లాభంతో 1,566 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో ఒక దశలో స్పాట్‌ మార్కెట్‌లో ధర 10 గ్రాములకు రూ.41,730ని తాకింది. ఇది ఇక్కడ జీవితకాల గరిష్టస్థాయి. పసిడి చివరకు రూ.41,690 వద్ద ముగిసింది. ఇక నైమెక్స్‌ లైట్‌ స్వీట్‌ క్రూడ్‌ విషయానికి వస్తే, శుక్రవారం ధరతో పోల్చితే ప్రారంభ ట్రేడింగ్‌లో 2 శాతం పెరుగుదలతో 64.72 డాలర్లకు పెరిగింది.

72 స్థాయికి రూపాయి పతనం..
ముంబై: అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, దీనితో క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల, దేశంలో ద్రవ్యోల్బణం భయాలు, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు భారత్‌ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 13 పైసలు పతనమై 71.93 వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బలహీనధోరణిలో 72.03 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.11 కనిష్టాన్ని కూడా చూసింది. చివరకు గత శుక్రవారం ముగింపు (71.80)తో పోల్చి 13 పైసలు నష్టపోయి 71.93 వద్ద ముగిసింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఆ తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరినప్పటికీ మళ్లీ పతనబాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో 71–73 శ్రేణిలో ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. పైగా క్రూడ్‌ అప్‌ట్రెండ్‌ రూపాయికి ప్రతికూలంగా నిలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top