ప్రపంచ ఎకానమీకి వైరస్‌ ముప్పు!

OECD lowers growth to 2.0persant this year in the aftermath of Corona19 - Sakshi

ఈ క్వార్టర్‌లో మందగించనున్న వృద్ధి

దశాబ్దకాలంలో తొలిసారి: ఓఈసీడీ

ప్యారిస్‌: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్‌19 (కరోనా వైరస్‌) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్‌ ప్రభావాలపై ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

2020లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు సుమారు అరశాతం నెమ్మదించి 2.4 శాతానికి పరిమితం కావొచ్చని.. ఒకవేళ వైరస్‌ తీవ్రత పెరిగిన పక్షంలో ఇది 1.5 శాతానికి కూడా పడిపోవచ్చని ఓఈసీడీ పేర్కొంది. ‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు అంతంతమాత్రంగాను, అనిశ్చితిలోనూ ఉన్నట్లు కనిపిస్తోంది’ అని వివరించింది. చివరిసారిగా 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు .. త్రైమాసికాలవారీగా వృద్ధి మందగించింది. పూర్తి సంవత్సరంపరంగా చూస్తే 2009లో వృద్ధి రేటు క్షీణించింది.  

గతంలో కన్నా తీవ్రం..
గతంలో వచ్చిన వైరస్‌ల కన్నా ప్రస్తుత కరోనా వైరస్‌ ప్రభావాలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఓఈసీడీ హెచ్చరించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి మరింతగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ‘ ప్రపంచ ఉత్పత్తి, వాణిజ్యం, పర్యాటకం, కమోడిటీ మార్కెట్లలో చైనా పెద్ద పాత్ర పోషిస్తోంది. చైనాలో వైరస్‌ ధాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలకు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వ్యాపార సంస్థల లాభాలకు గండి పడనుంది. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ఉత్పత్తి పడిపోవడంతో ప్రధానంగా ఆసియాపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అలాగే చైనాపై ఆధారపడిన ఇతర దేశాల కంపెనీలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని ఓఈసీడీ పేర్కొంది.

భారత్‌ అంచనాలు కట్‌..: కరోనా వైరస్‌ రిస్క్‌ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఓఈసీడీ తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది.

వృద్ధి రేటును 4.9 శాతానికి తగ్గించిన ఫిచ్‌
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్‌ సొల్యూషన్స్‌ సోమవారం ప్రకటించింది. దేశీయంగా డిమాండ్‌ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్‌ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. ‘‘కోవిడ్‌ వైరస్‌ చైనాలో ప్రబలిన కారణంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్‌ సరఫరా చైన్‌లో ఏర్పడిన ఇబ్బందులు భారత ఎగుమతి ఆధారిత తయారీ రంగంపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలే తాజా సవరణకు నేపథ్యం’’అని ఫిచ్‌ వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top