టాటాపై వాడియా కేసు వెనక్కి | Nusli Wadia withdraws all defamation cases against Ratan Tata | Sakshi
Sakshi News home page

టాటాపై వాడియా కేసు వెనక్కి

Jan 14 2020 2:50 AM | Updated on Jan 14 2020 2:50 AM

Nusli Wadia withdraws all defamation cases against Ratan Tata - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్‌ చైర్మన్‌ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

2016లో టాటా గ్రూప్‌ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ రతన్‌ టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్‌ 15న ముంబైలోని మేజిస్ట్రేట్‌ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్‌ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement