జెట్‌ఎయిర్‌వేస్‌ సాగాలో న్యూ ట్విస్ట్‌ 

Naresh Goyal Likely To Submit Bid For Stake In Jet Airways Report - Sakshi

సాక్షి,ముంబై : జెట్‌ ఎయిర్‌వేస్‌ సాగాలో సరికొత్త ట్విస్ట్‌ వ్యాపార వర్గాల్లో చక‍్కర్లు కొడుతోంది. మాజీ ప్రమోటర్, గత నెలలో చైర్మన్‌గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్‌లైన్స్‌లో వాటాను తిరిగి దక్కించు కోవాలని యోచిస్తున్నారట. జెట్‌లో వాటాల కొనుగోలుకు  ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్‌తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  త్వరలోనే ఆయన బిడ్‌ను దాఖలు  చేయనున్నారని   తెలుస్తోంది. 
  
ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రుణపరిష్కారప్రనాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వెస్‌లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్‌లైన్‌ను  పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్‌ 12వరకు పొడిగిస్తున్నట్టు ఎస్‌బీఐ క్యాపిటల్‌ ప్రకటించింది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్‌, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్‌ వాటాల  ఒక కొనుగోలుకు ఆసక్తి  చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్‌బీఐ అధికారులతో సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 

కాగా అప్పుల సంక్షోభంతో కుప్పకూలుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు కష్టాలు వెన్నంటుతున్నాయి. తీవ్ర నిధుల కొరత, రుణాల భారంతో పాటు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్ధితిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ అష్ట కష్టాలు పడుతోంది. బాకీలు కట్టలేందంటూ ఎయిర్‌వేస్‌కు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్‌ (ఐవోసీ) ఇంధన సరఫరాను నిలిపివేసింది. తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించే ప్రణాళికలో భాగంగా  జెట్‌ ఎయిర్‌వేస్‌ను స్థాపించి విజయపథంలో  పరుగులు పెట్టించిన  ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌  చివరికి అనివార్య పరిస్థితుల్లో కంపెనీ బోర్డు నుంచి సతీమణి అనితా గోయల్‌తోపాటు వైదొలగిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top