ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌ | Multi Cap in ICICI Prudential | Sakshi
Sakshi News home page

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

Jul 22 2019 12:17 PM | Updated on Jul 22 2019 12:17 PM

Multi Cap in ICICI Prudential - Sakshi

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి ముందు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ తదితర ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్‌ విలువ ఆధారంగా ప్రత్యేకించి చిన్న, మధ్య, పెద్ద సైజు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే పథకాలు. లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే... మధ్య, చిన్న స్థాయి కంపెనీలకు దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు వీటిల్లో ఏ కంపెనీ అని ఎంపిక చేసుకోవాలి...? ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఎదురయ్యే సందేహం ఇదే. ఇటువంటి వారికి మల్టీక్యాప్‌ పథకాలు అనువుగా ఉంటాయి. ఇవి ఒకే తరహా మార్కెట్‌ సైజు కలిగిన కంపెనీల్లో కాకుండా, లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో మంచి వృద్ధి, రాబడులకు అవకాశాలున్న కంపెనీలను పెట్టుబడులకు ఎంచుకుంటాయి. తద్వారా దీర్ఘకాలంలో మార్కెట్లను మించి రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ మల్టీక్యాప్‌ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ పథకం మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి.

రాబడులు..: బెంచ్‌ మార్క్‌ సూచీతో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ ఒక్క మూడేళ్ల కాలంలో మినహా... ఏడాది, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల కాల రాబడుల్లో ముందుంది. ప్రతీ నెలా రూ.15,000ను సిప్‌ రూపంలో 15 ఏళ్ల పాటు ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే నేడు రూ.56.4 లక్షలు సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.18 లక్షలు. ఏటా 14 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి రేటు ఇది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా చూసే బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కాంపౌండెడ్‌గా ఇచ్చిన వార్షిక రాబడి 14 శాతంగానే ఉంది. ఈ పథకం ఏడాదిలో 5.38 శాతం రాబడులు ఇవ్వగా, మూడేళ్లలో 9.60 శాతం, ఐదేళ్లలో 10.98 శాతం, పదేళ్లలో 13.44 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ రాబడులు ఏడాదిలో 1.75 శాతం, మూడేళ్లలో 10.47 శాతం, ఐదేళ్లలో 9.85 శాతం, పదేళ్లలో 11.70 శాతం రాబడులు ఇచ్చింది. భిన్న మార్కెట్లలోనూ ఈ పథకం స్థిరమైన పనితీరు చూపించిన నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. 

పెట్టుబడుల విధానం..: మల్టీక్యాప్‌ కావడంతో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఏ విభాగంలో ఉంటే, ఆయా విభాగంలోని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఈ పథకాలకు ఉంటుంది. దాంతో మంచి రాబడులను ఇవ్వగలవు. వృద్ధి అవకాశాలు, విలువ పరంగా చౌకగా ఉన్న వాటిని ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. భిన్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు, అదే సమయంలో ఒకే రంగంలో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ లేకుండా రిస్క్‌ చర్యలను కూడా ఈ పథకంలో గమనించొచ్చు. ఇటువంటి చర్యలతోనే ఈ పథకం స్థిరమైన రాబడులను ఇవ్వగలుగుతోంది. ఇక స్మాల్‌ క్యాప్‌నకు ఎంత, మిడ్‌క్యాప్‌నకు ఎంత, లార్జ్‌క్యాప్‌నకు ఎంత మొత్తం పెట్టుబడులు కేటాయించాలనే విషయంలో ఈ పథకానికి ఓ నమూనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ పథకం ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మెటల్స్, టెలికం, విద్యుత్, కన్జ్యూమర్‌ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement