బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!!

Modi government planning gold amnesty scheme to curb black money - Sakshi

లెక్క చూపని పసిడిపై కేంద్రం కన్ను!

ప్రభుత్వం పరిశీలనలో ‘క్షమాభిక్ష’ పథకం...

‘పెద్ద నోట్ల’ మాదిరిగానే వెలికితీసే యోచన

స్వచ్ఛందంగా వెల్లడించి పన్ను చెల్లించే అవకాశం

న్యూఢిల్లీ: ‘భాయియో.. ఔర్‌ బెహనో!!’ అంటూ ప్రధాని ఒక్క రాత్రిలో పెద్ద నోట్లన్నీ రద్దు చేసేయటం ఎవరూ మరిచిపోలేరేమో!!. ఇదిగో ఇపుడు అలాంటి ప్రమాదమే మన ఇళ్లలో ఉన్న బంగారానికి కూడా వచ్చేటట్టు కనిపిస్తోంది. ఎందుకంటే లెక్కలు లేకుండా పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెలికితీయాలని కేంద్రం ఆలోచిస్తోంది. నిజానికి పెద్ద నోట్లను రద్దు చేసినపుడు బయటపడ్డ నల్లధనం రూ.11,000 కోట్లను మించలేదు. నోట్లు కాకుండా బంగారం, భూముల రూపంలోనే ఎక్కువ నల్లధనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో మోదీ సర్కారు తదుపరి చర్య భూముల రిజిస్ట్రేషన్, బంగారం కొనుగోళ్లపైనే ఉంటుందని వార్తలూ వచ్చాయి. ఇపుడు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

పన్ను చెల్లించని ఆదాయంతో పోగేసుకున్న బంగారాన్ని స్వచ్ఛందంగా ప్రకటించి, దానిపై పన్ను చెల్లించేలా ఓ క్షమాభిక్ష పథకాన్ని కేంద్రం తీసుకురానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పన్ను చెల్లించని ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారాన్ని ఈ పథకం కింద ప్రకటించి, నిర్దేశిత పన్ను చెల్లించడం ద్వారా దాన్ని చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. పన్ను ఎంతన్నది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు. బంగారం విలువపై 30 శాతం పన్ను, విద్యా సెస్సుతో కలిపి 33 శాతం వరకు ఉండవచ్చనేది విశ్వసనీయ సమాచారం. ఈ పథకానికి కేంద్ర ఆర్థిక శాఖ తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలిసింది. ఒక వ్యక్తికి ఎంత బంగారం ఉండొచ్చనేది కూడా ఈ పథకంలో ఉంటుంది. వివాహిత మహిళలకు పరిమితిని కాస్త పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంత తేలికేమీ కాదు!!
2016 నవంబర్లో డీమోనిటైజేషన్‌ (రూ.500, రూ.1,000 నోట్ల రద్దు) తరువాత నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (ఐడీఎస్‌–2) పథకాన్ని 2017లో తెచ్చింది. కానీ ఇదేమంత విజయం సాధించలేదు. అందుకే బంగారం రూపంలో వ్యవస్థలో పోగుపడిన నల్లధనాన్ని వెలికితీయాలన్న ఈ పథకాన్ని కేంద్రం తెస్తున్నట్లు సమాచారం. ‘‘పథకం ఆలోచన మంచిదే. కానీ సమర్థంగా అమలు చేయటం కష్టం. ప్రజలు ఎంతో కాలంగా బంగారాన్ని సమకూర్చుకుంటుంటారు. వారసత్వంగా వచ్చే బంగారానికి ఎలాంటి లావాదేవీ వివరాలూ ఉండవు. తమ దగ్గరున్న బంగారం విలువలో మూడోవంతు కోల్పోయేందుకు జనం ఇష్టపడరు’’ అని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇక స్వచ్ఛందంగా ప్రకటించాక పన్ను అధికారుల వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం కూడా వారిలో ఉంటుందన్నారు.

త్వరలో గోల్డ్‌ బోర్డు
గోల్డ్‌ బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ విభాగం కలిసి సిద్ధం చేసినట్టు తెలియవచ్చింది. ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ప్రైవేటు రంగ ప్రతినిధులకూ ఈ బోర్డులో చోటు కల్పిస్తారు. బంగారం కొనే వారిని ఆకర్షించేలా పెట్టుబడి పథకాల రూపకల్పన, బంగారం నిల్వలను ఆర్థిక ఆస్తిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను బంగారం బోర్డు చూడనుందని సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న సార్వభౌమ బంగారం బాండ్ల పథకాన్ని మరింత ఆకర్షణీయంగానూ మార్చే చర్యలను బోర్డు చేపడుతుంది.


మన దేశం ఏటా 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశ సంస్కృతిలో బంగారం భాగం కావడంతో, భారతీయుల గోల్డ్‌ దిగుమతులు ఏటా పెరిగిపోతున్నాయి. కరెంటు ఖాతా లోటూ పెరుగుతోంది. దీన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం దిగుమతులపై సుంకాలను విధించినా పెద్దగా ఫలితం రాలేదు. దేశ ప్రజల వద్ద సుమారు 20,000 టన్నుల బంగారం ఉంటుందని అంచనా. లెక్కల్లో చూపనిది, వారసత్వంగా వచ్చినది కూడా కలుపుకుంటే ఇది 25,000–30,000 టన్నుల వరకు ఉండొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top