నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌

Microsofts annual package of Rs 1.54 crore for Charit Reddy - Sakshi

చరిత్‌ రెడ్డికి రూ.1.54 కోట్ల వార్షిక ప్యాకేజీ

రామగిరి (నల్లగొండ): బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ అభ్యసిస్తున్న నల్లగొండ కుర్రాడు చింతరెడ్డి సాయి చరిత్‌రెడ్డికి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చక్కని ఆఫర్‌ ఇచ్చింది. ఆఖరి సంవత్సరం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా చరిత్‌రెడ్డి రూ.1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన చరిత్‌రెడ్డి 8వ తరగతి వరకు నల్లగొండలోని స్థానిక సెయింట్‌ ఆల్ఫోన్స్‌ స్కూల్లో, తరవాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 51వ ర్యాంకు సాధించి ఐఐటీ సీటు దక్కించుకున్నాడు. చరిత్‌ రెడ్డి తల్లిదండ్రుల స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మాపురం. తండ్రి సైదిరెడ్డి ఎంపీటీసీగా, తల్లి నాగసీత సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నారు. విశేషమేంటంటే తండ్రి సైదిరెడ్డి కూడా బీటెక్‌ చేశారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం బాట పట్టారు. తనయుల్లో పెద్దవాడైన సాయి చరిత్‌... తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదివి మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌ దక్కించుకున్నాడు.  

కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఇష్టం
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయిన నేపథ్యంలో బుధవారం చరిత్‌రెడ్డి నల్లగొండకు చేరుకున్నాడు. తాజా ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయిన ముగ్గురిలో దక్షిణాదికి చెందినది చరిత్‌రెడ్డి ఒక్కడే. క్యాంపస్‌లో ఓటీపీగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడం, తద్వారా దాని ప్రాజెక్టుల్లో మంచి ప్రతిభ కనపర్చడం కూడా చరిత్‌కు ఆ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ రావటానికి కారణమైంది. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌ క్యాంపస్‌లో జూలైలో విధుల్లో చేరాల్సి ఉందని ఈ సందర్భంగా చరిత్‌ చెప్పాడు. ‘‘నా సంతోషాన్ని మా అమ్మానాన్నలతో పంచుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచీ కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఇష్టం దానికి తగ్గట్టే టీచర్ల మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో చదివాను. అమ్మ సహకారం చాలా ఎక్కువ’’ అని వ్యాఖ్యానించాడు. చరిత్‌ తమ్ముడు అజిత్‌ రెడ్డి ప్రస్తుతం చైన్నె ఐఐటీలో మొదటి సంవత్సరం       చదువుతున్నాడు.  

చాలా ఆనందంగా ఉంది: సైదిరెడ్డి, నాగసీత
పిల్లలిద్దరూ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఫస్టే. ఇద్దరూ ఐఐటీ స్టూడెంట్స్‌ కావడం, పెద్ద కుమారుడు భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బాంబే ఐఐటీలో సీటు వచ్చినప్పుడే మంచి భవిష్యత్‌ ఉంటుందని ఊహించాం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top