breaking news
bombay IIT
-
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
‘ఆ కుర్రాడికి సీటు ఇవ్వకుంటే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే!’
Dalit Boy IIT Seat Case: విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ దళిత బాలుడికి సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడం, కింది న్యాయస్థానంలో పిటిషన్ తిరస్కరణకు గురికావడంపై విచారం వ్యక్తం చేసిన కోర్టు.. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ బెంచ్ మార్క్ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ జైబీర్‌సింగ్.. 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో 25, 894వ ర్యాంక్(ఎస్సీ కేటగిరీలో 864) సాధించాడు. కౌన్సెలింగ్‌లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న మొదటి వ్యక్తి కూడా ఈ కుర్రాడే. దీంతో ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సీటు పేమెంట్ రూ. 15వేలను చివరి నిమిషంలో చెల్లించాడతను. తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ జరగకపోవడంతో అతనికి సీటు అలాట్ కాలేదు. ఈ సమస్యపై కౌన్సిలింగ్ జరిగిన ఖరగ్‌పూర్ ఐఐటీని వెంటనే ఆశ్రయించిన లాభం లేకపోయింది. బాంబే ఐఐటీ దీంతో ప్రిన్స్, బాంబే హైకోర్టు లో ప్లీ దాఖలు చేయగా.. కోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జరిగింది సాంకేతిక తప్పిదం. విద్యార్థి తప్పేం లేదు. పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లం అవుతాం. తక్షణమే బాంబే ఐఐటీలో అతనికి సీటు కేటాయించాలి. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి. 48 గంటల్లో అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని Joint Seat Allocation Authority (JOSAA)ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ అంటే.. పూర్తి న్యాయం జరిగేలా చూడడం కోసం తమ విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు.. అవి పాటించి తీరాల్సిందే!(కొన్ని సందర్భాలు మినహాయించి). ఈ ఆర్టికల్‌ను తెరపైకి తెచ్చిన బెంచ్.. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆల్లోకేషన్ ఆథారిటీని ఆదేశించింది. ఇక కౌన్సిలింగ్‌ల సమయంలో టెక్నికల్ సమస్యలతో ఎంతో మంది విద్యార్థులు మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటిది ఇలాంటి తీర్పులు అర్హత ఉన్న కొందరికైనా న్యాయం అందేలా చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పుడు. -
కరోనా వేళ వాక్సిన్ కోసం ఆరాటం
-
వ్యాక్సిన్ల పేరుతో చెలగాటమా?
ఈ సంవత్సరం ఆగస్టు 15లోగా ప్రజలకు వినియోగంలోకి వచ్చేలా కరోనా వ్యాక్సిన్‌ని ఆవిష్కరిస్తామని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎమ్ఆర్) 2020 జూలై 2న చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సానుకూలంగా కాకుండా శాస్త్ర ప్రపంచం ఆ ప్రకటనలోని డొల్లతనంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఏ వ్యాక్సిన్‌కయినా తొలి రెండు దశల నమూనా పరీక్షలకు కనీసం 15 నెలల కాలం అవసరమైన నేపథ్యంలో ఒకటిన్నర నెలలలోపే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగంలోకి తీసుకువస్తానంటూ ఐసీఎమ్ఆర్ చేసిన ప్రకటన మన శాస్త్రపరిశోధనల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉంది. శాస్త్ర పరిశోధనా సంస్థలు రాజకీయ పాక్షికతకు లోబడి ఇలాంటి ప్రకటనలు చేస్తే భారతీయ విజ్ఞాన శాస్త్రాల విశ్వసనీయతే దెబ్బతినే ప్రమాదముంది. అందుకే మనం ఏం ప్రచురిస్తున్నాం, ఏం చెబుతున్నాం అనే అంశంలో అత్యంత జాగరూకత ప్రదర్శించడం అవసరం. అందరికంటే ముందంజలో ఉండాలనే భావనపై మనలో ఉన్న ఆశ, అభిరుచి అనేవి మన సాంస్కృతిక మనస్తత్వంలో భాగమై ఉంటున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ని కనిపెట్టి, ఉత్పత్తి చేయడంలో మనమే ప్రథమస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఇతర దేశాల్లో కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్లపై పరిశోధనలు పుంజుకుని అభివృద్ధి మార్గంలో మనకంటే చాలా ముందు ఉంటున్న వాస్తవాన్ని మనం పట్టించుకోము. ఈ పరుగుపందెంలో గెలవడానికి ఉన్న ఒక మార్గం ఏదంటే, వ్యాక్సిన్‌ని మనమే ముందుగా రూపొందిస్తామని చెప్పడమే. పైగా అదెప్పుడు సాధ్యమవుతుందో కచ్చితమైన తేదీని కూడా ప్రకటించివేయడం. కోవిడ్–19 వ్యాధికి వ్యతిరేకంగా ప్రభుత్వపరంగా సాగే పోరాటంలో ముందు ఉంటున్న భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎమ్ఆర్) 2020 జూలై 2న ఒక ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశాక, ఈ సంవత్సరం ఆగస్టు 15లోగా వ్యాక్సిన్‌ని ఆవిష్కరిస్తామని అది తెలియజేసింది. వ్యాక్సిన్ పేరు కోవాక్సిన్. ఐసిఎమ్ఆర్తో కలిసి పనిచేస్తున్న హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. కానీ, ఇంతతక్కువ కాలంలో వ్యాక్సిన్‌ని విడుదల చేస్తామని, ఆ ఉత్తరంలో సంకేతించిన ధ్వని తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రధాన సమస్య ఏమిటంటే ఖచ్చితంగా ఫలానా తేదీన వ్యాక్సిన్ విడుదల చేస్తామంటూ గడువు తేదీని ప్రకటించడమే. వ్యాక్సిన్‌ని క్లిని కల్ ట్రయల్‌కు సమర్పించాలంటే కచ్చితంగా మనుషులను వినియోగించాలి. క్లినికల్ దశకు ముందు చేసే ఈ ప్రక్రియలో జంతువులపై ముందుగా వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తారు. వాటిపై ఫలి తాలు మెరుగ్గా ఉంటేనే తర్వాత మానవులపై దాన్ని ప్రయోగిస్తారు. మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగించే తొలిదశకు కొంతమంది అభ్యర్థులు అంటే కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే సరిపోతారు. భద్రత, డోసేజ్ స్థాయిల గురించి పరీక్షించడమే ఈ దశ లక్ష్యం. వీరిని 24 గంటలపాటు పరిశీలనలో ఉంచి ఏవైనా తీవ్ర దుష్పలితాలు సంభవిస్తాయా, వీరి రోగినిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది అని గమనిస్తారు. ఇక రెండోదశలో అసంఖ్యాక ప్రజలపై నమూనా పరీక్షలు చేస్తారు. దీనికోసం కొన్ని వేలమంది అవసరమవుతారు. దీంట్లో కూడా వయసు, లింగం వంటి అంశాలకు సంబంధించి వేర్వేరు గ్రూపులను ఎంచుకుంటారు. ఈ దశ లక్ష్యం ఏమిటంటే రోగుల భద్రత, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ స్థాయి, రకం గురించి తెలుసుకోవడమే. సరైన రకం యాంటీబాడీస్‌ను వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని, గణనీయ సంఖ్యలో ఇవి ఉత్పత్తయ్యాయని తేలిన తర్వాతే మూడో దశ ట్రయల్ మొదలవుతుంది. ఈ దశలో భారీ సంఖ్యలో ప్రజలపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందా అని తనిఖీ చేస్తారు. దీనికోసం వేలాదిమంది మనుషుల అవసరం ఉంటుంది. వాస్తవంగా మనుషులపై ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేక పనిచేయదా అనేది కనిపెట్టడమే ఈ మూడో దశ లక్ష్యం. రోగాన్ని పూర్తిగా నయం చేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు కూడా ఈ దశలో పరీక్షిస్తారు. భారీ సంఖ్యలో ప్రజలపై దీన్ని ప్రయోగించాలంటే సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు. అంతిమంగా ప్రజల వినియోగంలోకి రావడానికి అసంఖ్యాకంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి కూడా సమయం పడుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 135 వ్యాక్సిన్లు క్లినికల్ దశకు ముందు దశలో సాగుతున్నాయి. వీటిలో 30 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో భారతీయ కోవాక్సిన్ స్థానం ఎక్కడ? మొదటి, రెండో దశ ట్రయల్స్ నిర్వహించడానికి ఇది ఆమోదం పొందింది. ట్రయల్స్ నిర్వహించేదుకు చివరి తేదీ జూలై 7 అని చెప్పారు. ప్రపంచంలో అనేక ఇతర వ్యాక్సిన్లు కూడా ఇప్పటికే 1, 2వ దశల్లో ఉన్నాయి కొన్నయితే 3వ దశలో ప్రవేశించాయి కూడా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్ 2020 జూలై 1నే మూడో దశ ట్రయల్స్‌ని ప్రారంభించింది. దీని ఫలితాలు ఏ రోజైనా వెలుగులోకి రావచ్చు. కోవాక్సిన్ ప్రీ–క్లినికల్ దశ పరీక్ష 50 రోజుల పాటు జరగాల్సి ఉండగా అది ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో కనబడలేదు. ఇది శాస్త్రీయ కృషి విషయంలో ఏమాత్రం ఆమోదనీయమైంది కాదు. ట్రయల్స్ దశలో ఉంటున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాక్సిన్ వ్యాక్సిన్ విషయంలో చెబుతున్న సమయం చాలా తక్కువ అనే చెప్పాలి. గత 28 రోజులుగా తొలి దశ ట్రయల్స్‌ని 375 మందిపై ప్రయోగించాల్సి ఉంది. ఇక రెండో దశ అయితే 750 మందిపై ప్రయోగిస్తూ 14 నెలలపాటు కొనసాగిస్తారు. అంటే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తొలి రెండు దశల ట్రయల్స్ పూర్తి కావాలంటే కూడా మరో 15 నెలల సమయం పడుతుంది. తన ప్రకటనపై తీవ్ర ఆక్షేపణలు రావడంతో ఐసీఎమ్ఆర్ అవాంఛితమైన జాప్యందారీ ధోరణులను తొలగించడమే తన ఉద్దేశమని జూలై 2న మరో వివరణ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ భద్రతపై ఇవి హామీ ఇస్తున్నాయి తప్పితే ప్రజావినియోగంలోకి తీసుకొస్తామంటూ ప్రకటించిన గడువుతేదీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ మరొక ప్రకటన చేస్తూ ఐసీఎమ్ఆర్ విధించిన గడువుతేదీ హేతువిరుద్ధంగా ఉందని, ఇంతకుముందు ఇలా వ్యాక్సిన్ విడుదలపై గడువు తేదీనీ ఎవరూ ప్రకటించలేదని ఆక్షేపించింది. ఈ విషయంలో మరిన్ని తీవ్రమైన అంశాలు కూడా దాగి ఉన్నాయి. వాటిలో మొదటిది ఇలాంటి ప్రకటనల విషయంలో పాటించాల్సిన జాగరూకత. వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి పరీక్షలకోసం స్వచ్చందంగా ముందుకొచ్చే వలంటీర్ల శరీరాల్లో కలిగే మార్పులతో కూడి ఉంటాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ ఇలాంటి వలంటీర్లలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక దుష్ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో కొన్ని ఊహించనివి జరుగుతాయి, మరికొన్ని తీవ్ర స్థాయిలో కూడా పరిణమిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ అసలు వ్యాధిని మరింత తీవ్రతరం చేయవచ్చు కూడా. కాబట్టి రెండో దశ నమూనా పరీక్షలు వ్యాక్సిన్ భద్రతను పూర్తి స్థాయిలో నిర్దారించాల్సి ఉంది. మూడో దశ నమూనా పరీక్షల్లో ఏదైనా అవాంఛిత లోపం బయటపడితే, అది అప్పటికే వ్యాక్సిన్‌ని తమ శరీరాలపై ప్రయోగించుకున్న వేలాది వలంటీర్లు ఫలితంలేని యాంటీ వైరల్ కవచాన్ని మోసేవారుగానూ, లేకుంటే వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ వ్యాధి బారిన పడేవారుగానూ మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వ్యాక్సిన్ల విషయంలో ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా, మొత్తం ప్రక్రియలో ఏ దశలో నైనా సరే రాజీపడినా, భారతపౌరులపై అది దీర్ఘకాలంలో తీవ్రమైన దుష్ఫలితాలకు దారితీయవచ్చని భారతీయ శాస్త్ర పరిశోధనా అకాడెమీ తేల్చి చెప్పింది. ఈ మొత్తం ఉదంతం ప్రభుత్వ సంస్థల స్వయం ప్రతిపత్తిపైనే సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి కొన్ని నిర్దిష్ట సంస్థలు వృత్తితత్వాన్ని పక్కనబెట్టి రాజకీయ పాక్షిక ధోరణులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంస్థల విశ్వసనీయ అంచనాలు రాజకీయాలకు ప్రభావితమవుతున్నట్లుంది. అంతకుమించి భారతీయ శాస్త్రజ్ఞులు, నిపుణులు పరిశోధనల ప్రాధమికాంశాల పట్ల కూడా సీరియస్‌గా లేరని అంతర్జాతీయంగా విమర్శలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది. పైగా ఐసీఎమ్ఆర్ ప్రకటించినట్లుగా గడువుతేదీలోపు వ్యాక్సిన్ విడుదల సాధ్యం కాకపోతే, ఇకపై భారతీయ శాస్త్రపరిశోధనా సంస్థలు వెలువరించే ప్రకటనలను పూర్తి అవిశ్వాసంతో చూసే ప్రమాదం కూడా ఉంది. తమ విశ్వసనీయతనే కోల్పోయిన పక్షంలో కరోనా వ్యాధి కట్టడికోసం మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటిం చండి అంటూ ప్రభుత్వ సంస్థలు చేసే అధికారిక ప్రకటనలను కూడా జనం విశ్వసించడం తగ్గిపోతుంది. చివరగా, నేటి ప్రపంచంలో సోషల్ మీడియాలో భరించలేనంత స్థాయిలో నానా చెత్త సమాచారం ప్రచారమవుతోంది. ఎవరూ నిజం చెప్పడంలేదని జనాభాలో ఎక్కువమంది నమ్ముతున్న తరుణంలో శాస్త్ర నిపుణులు కూడా తమ విలువ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే శాస్త్రజ్ఞులు ప్రచురిస్తున్న నాణ్యత లేని పరిశోధనా పత్రాలకు తోడు దేశాధ్యక్షులు కూడా కోవిడ్–19 కట్టడి గురించి చేస్తున్న మతిలేని ప్రకటనలు ప్రజల్లో విశ్వసనీయతను మరింత తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది. అందుకే మనం ఏం ప్రచురిస్తున్నాం, ఏం చెబుతున్నాం అనే అంశంలో అత్యంత జాగరూకత ప్రదర్శించడం అవసరం. అనురాగ్ మెహ్రా, కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఐఐటీ బాంబే -
నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్ ఆఫర్
రామగిరి (నల్లగొండ): బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న నల్లగొండ కుర్రాడు చింతరెడ్డి సాయి చరిత్రెడ్డికి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చక్కని ఆఫర్ ఇచ్చింది. ఆఖరి సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా చరిత్‌రెడ్డి రూ.1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన చరిత్‌రెడ్డి 8వ తరగతి వరకు నల్లగొండలోని స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో, తరవాత ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 51వ ర్యాంకు సాధించి ఐఐటీ సీటు దక్కించుకున్నాడు. చరిత్ రెడ్డి తల్లిదండ్రుల స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మాపురం. తండ్రి సైదిరెడ్డి ఎంపీటీసీగా, తల్లి నాగసీత సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నారు. విశేషమేంటంటే తండ్రి సైదిరెడ్డి కూడా బీటెక్ చేశారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం బాట పట్టారు. తనయుల్లో పెద్దవాడైన సాయి చరిత్... తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదివి మైక్రోసాఫ్ట్ ఆఫర్ దక్కించుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయిన నేపథ్యంలో బుధవారం చరిత్‌రెడ్డి నల్లగొండకు చేరుకున్నాడు. తాజా ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయిన ముగ్గురిలో దక్షిణాదికి చెందినది చరిత్‌రెడ్డి ఒక్కడే. క్యాంపస్‌లో ఓటీపీగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడం, తద్వారా దాని ప్రాజెక్టుల్లో మంచి ప్రతిభ కనపర్చడం కూడా చరిత్‌కు ఆ సంస్థ నుంచి భారీ ఆఫర్ రావటానికి కారణమైంది. వాషింగ్టన్‌లోని రెడ్మండ్ క్యాంపస్‌లో జూలైలో విధుల్లో చేరాల్సి ఉందని ఈ సందర్భంగా చరిత్ చెప్పాడు. ‘‘నా సంతోషాన్ని మా అమ్మానాన్నలతో పంచుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం దానికి తగ్గట్టే టీచర్ల మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో చదివాను. అమ్మ సహకారం చాలా ఎక్కువ’’ అని వ్యాఖ్యానించాడు. చరిత్ తమ్ముడు అజిత్ రెడ్డి ప్రస్తుతం చైన్నె ఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చాలా ఆనందంగా ఉంది: సైదిరెడ్డి, నాగసీత పిల్లలిద్దరూ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఫస్టే. ఇద్దరూ ఐఐటీ స్టూడెంట్స్ కావడం, పెద్ద కుమారుడు భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బాంబే ఐఐటీలో సీటు వచ్చినప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందని ఊహించాం. -
బాంబే ఐఐటీకి 2017 జేఈఈ బాధ్యతలు
హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం చేపట్టే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 2017లో నిర్వహించే బాధ్యతలను బాంబే ఐఐటీకి అప్పగిస్తూ ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2017 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌కు సంబంధించి విద్యార్థులకు ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ వచ్చే నెలలో కాని, నవంబర్‌లో కాని సీబీఎస్ఈ విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ పరీక్షను 2017 ఏప్రిల్‌లో నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ తుది ర్యాంకులను ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకుండానే జేఈఈ స్కోర్ ఆధారంగా ఖరారు చేయనుంది. వాటి ద్వారానే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను చేపట్టనుంది.