ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ఫిబ్రవరి 13న ‘మేకిన్ ఇండియా వీక్’ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ఫిబ్రవరి 13న ‘మేకిన్ ఇండియా వీక్’ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో 60 దేశాలకు చెందిన 1,000కి పైగా కంపెనీలు, ప్రముఖులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆవిష్కరణ, రూపకల్పన, స్థిరత్వం అనే అంశాలు థీమ్‌గా ప్రారంభం కానున్న మేకిన్ ఇండియా వీక్... ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. అధిక మొత్తంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రకటించిన దగ్గరి నుంచి గడిచిన 17 నెలల్లో (మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టక ముందు 17 నెలలతో పోలిస్తే) ఎఫ్‌డీఐలు 35 శాతంమేర పెరిగాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని ఆటోమోటివ్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి తదితర విభాగాల్లో విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. ఫాక్స్‌కాన్, జెనిత్, ఐకియా, వాండా గ్రూప్ ఆఫ్ చైనా వంటి పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని తెలియజేశారు. స్టార్టప్స్‌కు, దేశీ కంపెనీలకు చేయూతనందించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అంతర్జాతీయ ఇన్‌ఫ్రా అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పారు. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.