మాల్యా లండన్‌ ఆస్తుల జప్తునకు ఓకే!

Mallya: London court orders to recover funds owed to banks - Sakshi

మన బ్యాంకులకు అనుకూలంగా బ్రిటన్‌ హైకోర్టు ఉత్తర్వులు

మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించడానికి అధికారులకు అనుమతి

అవసరమైతే బలప్రయోగం కూడా చేయొచ్చని స్పష్టీకరణ

మాల్యా అప్పీలు; పెండింగ్‌లో పెట్టిన కోర్టు  

లండన్‌: భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగవేసి లండన్‌కు వెళ్లిపోయిన మాజీ లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా ఆస్తులు జప్తు చేయడానికి బ్రిటన్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్‌ హైకోర్టు జడ్జి... సానుకూల ఉత్తర్వులు జారీ చేశారు. లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో ఉన్న మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి, ఆయన ఏజెంట్లకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం మాల్యా అక్కడే ఉంటున్నారు. అయితే, మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించాలని తామేమీ ఆదేశించడం లేదని, తమ బకాయిలు వసూలు చేసుకోవటానికి బ్యాంకులకు అవకాశం మాత్రమే ఇస్తున్నామని జడ్జి చెప్పారు. ‘‘హైకోర్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి, ఆయన అధికార పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్‌ ఎవరైనా లేడీవాక్, బ్రాంబిల్‌ లాడ్జ్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించి సోదాలు చేసేందుకు, మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు అనుమతిస్తున్నట్టు’’ జస్టిస్‌ బిరాన్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. భవనాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైతే బలప్రయోగం కూడా చేయొచ్చని కోర్టు ఆదేశించడం గమనార్హం. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లేందుకు విజయ్‌ మాల్యా చేసుకున్న అభ్యర్థన కోర్టు పరిశీలనలో ఉంది.

బ్యాంకులకు విజయం...!
కాగా, తాజా ఆదేశాలతో బ్యాంకులకు అన్ని రకాల జప్తు అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్టేనని ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. భారత డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఆదేశాలను అమలు చేసేందుకు వాటికి అవకాశం లభించినట్టుగా వారు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల స్వాధీనానికి బ్యాంకుల అనుమతినిస్తూ భారతీయ డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ మాల్యా లోగడ బ్రిటన్‌ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. 13 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కార్పొరేషన్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకుతోపాటు జేఎం ఫైనాన్షియల్‌ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఉన్నాయి. మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలతో మాల్యాను భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

159 ఆస్తుల గుర్తింపు 
న్యూఢిల్లీ: విజయ్‌మాల్యాకు చెందిన 159 ఆస్తులను గుర్తించినట్టు బెంగళూరు పోలీసులు ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా వీటిలో ఏ ఒక్కదానినీ స్వాధీనం చేసుకోలేదని వారు తెలిపారు. వీటిలో కొన్ని ఆస్తులను ఇప్పటికే ఈడీ ముంబై జోన్‌ స్వాధీనం చేసుకుందని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు నివేదించారు. అయితే, మాల్యాకు చెందిన ఇతర ఆస్తుల గుర్తింపునకు మరింత సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top