వేతనాలపై చేతులెత్తేసిన జెట్‌

Jet Airways CEO Vinay Dube Says Banks Unable To Make Salary Commitments - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి చేదు వార్త చేరవేసింది. సంస్ధ విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేతన చెల్లింపులకు నిధులు సర్ధుబాటు చేయలేమని బ్యాంకుల కన్సార్షియం తెలిపిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ వినయ్‌ దూబే ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తూనే సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు కొన్ని నిధులు విడుదల చేయాలని తాము కోరగా బ్యాంకులు నిరాకరించాయని తెలిపారు.

కొద్ది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే వారు మరోచోట ఉద్యోగం చూసుకోవడం మినహా వారికి మరో మార్గం లేదని తాము పదేపదే బ్యాంకులను కోరినా ఫలితం లేకుండా పోయిందని దూబే ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను తాము బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై కంపెనీ షేర్‌హోల్డర్లే నిర్ణయం తీసుకోవాలని సులభంగా తేల్చేశారని చెప్పారు.

ఇక బోర్డు సమావేశాల్లోనూ వేతన బకాయిల చెల్లింపునకు ప్రమోటర్లు, వ్యూహాత్మక వాటాదారును కోరినా వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సహకరించాలని కోరినా ఫలితం లేకపోయిందని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top