ఐటీ ఆదాయ వృద్ధిపై కరోనా పడగ

IT sector revenue growth may hit decadal low due to coronavirus lockdown - Sakshi

దశాబ్ద కనిష్టానికి పడిపోవచ్చు:  క్రిసిల్‌ అంచనాలు

ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభం ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపించనున్నట్టు రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొంది. ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి దశాబ్ద కనిష్ట స్థాయి 0–2 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. మార్జిన్లు తగ్గిపోయి లాభాలు ప్రభావితం కావచ్చని పేర్కొంది. కొత్త ఒప్పందాలను కంపెనీలు నష్టపోవచ్చని, దాంతో భవిష్యత్తు ఆదాయాలపై రాజీ పడక తప్పని పరిస్థితి ఎదురవుతుందని ఓ నివేదిక విడుదల చేసింది. విదేశీ క్లయింట్లు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రస్తుత ఒప్పందాలు కూడా కొన్ని రద్దయిపోవచ్చని పేర్కొంది.

దేశీయ ఐటీ రంగం (ఐటీఈఎస్‌ కూడా కలుపుకుని) 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక వృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘‘సాధారణంగా నూతన ఒప్పందాలు మార్చి, మే నెలల మధ్యనే కుదురుతుంటాయి. కానీ, ఈ ఏడాది ప్రస్తుత సమయంలో చాలా క్లయింట్లు వ్యాపార పరంగా రిస్క్‌లను అధిగమించడంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో విచక్షణారహిత ఐటీ వినియోగాన్ని వాయిదా వేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కొనసాగించొచ్చు’’ అని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top