క్యూ1 బూస్ట్‌- ఇన్ఫోసిస్‌ ధూమ్‌ధామ్‌

Infosys technologies share zooms on Q1 results - Sakshi

15 శాతం దూసుకెళ్లిన షేరు

నికర లాభం​రూ. 4233 కోట్లు

తాజాగా 170 కోట్ల డాలర్ల డీల్స్‌

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిపుణుల అంచనాలను మించుతూ సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ ఇన్ఫోసిస్‌ షేరు హైజంప్‌ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లింది.రూ. 955ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి స్వల్పంగా వెనకడుగు వేసింది. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 919 వద్ద ట్రేడవుతోంది. 
 
ఫలితాలు ఓకే
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఇన్ఫోసిస్‌ వార్షిక ప్రాతిపదికన 12 శాతం అధికంగా రూ. 4,233 కోట్ల నికర లాభం ఆర్జించింది. విశ్లేషకులు రూ. 3,950 కోట్లను అంచనా వేశారు. ఇక మొత్తం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 1.7 శాతం పెరిగి రూ. 23,665 కోట్లను తాకింది. ఈ కాలంలో తాజాగా 1.7 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది. డాలర్ల రూపేణా ఆదాయం 2.4 శాతం నీరసించి 3121 మిలియన్‌ డాలర్లకు చేరింది. డిజిటల్‌ విభాగం నుంచి 1389 మిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించింది. తద్వారా మొత్తం ఆదాయంలో 44 శాతంపైగా వాటాను ఆక్రమించుకుంది. కాగా.. 2020-21 పూర్తి కాలానికి ఆదాయం 0-2 శాతం మధ్య పుంజుకోగలదని ఇన్ఫోసిస్‌ అంచనా(గైడెన్స్‌) వేసింది. నిర్వహణ లాభ మార్జిన్లు 21-23 శాతం స్థాయిలో నమోదుకాగలవని ఆశిస్తోంది. 10 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఇద్దరు క్లయింట్లను సంపాదించగా.. 1 మిలియన్‌ స్థాయిలో 11 డీల్స్‌ కుదుర్చుకుంది. అయితే 10 కోట్ల డాలర్ల స్థాయిలో ముగ్గురు కస్టమర్లను, 5 కోట్ల డాలర్ల స్థాయిలో ఒక క్లయింట్‌నూ కోల్పోయినట్లు కంపెనీ తెలియజేసింది. 

ఇబిట్‌ గుడ్‌
క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిట్‌) 9 శాతం బలపడి రూ. 5365 కోట్లను తాకినట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. మార్జిన్లు 1.5 శాతం మెరుగుపడి 22.7 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో 2.4 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ పూర్తి రుణ రహితమే కాకుండా 3.6 బిలియన్‌ డాలర్ల నగదు నిల్వలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. కాగా..క్యూ1లో ఇన్ఫోసిస్‌ షేరు 22 శాతం లాభపడటం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top