ఇండిగో నిర్వాకం : రన్‌వేపైనే ప్రయాణికుల అగచాట్లు

IndiGo Passengers Stranded On Tarmac For 7 Hours - Sakshi

న్యూఢిల్లీ : ఈ మధ్యన విమానయాన సంస్థలు ప్రయాణికులకు సరైన సదుపాయాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనడంలో ఈ ఘటనే నిదర్శనం. ఆదివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులు దాదాపు 7 గంటలకు పైగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపైనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం సోమవారం ఉదయం వరకు ఆ ఇండిగో విమానానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం. బస్సులో ఇండిగో విమానం ఆగివున్న రన్‌వేపైకి వచ్చిన ప్రయాణికులకు ఈ చేదు అనుభవం ఏర్పడింది. సిబ్బంది లేకపోవడంతో అక్కడి నుంచి మళ్లీ టర్మినల్‌ తీసుకెళ్లాల్సిన విమానయాన సంస్థ అధికారులు ప్రయాణికులను అక్కడే గాలికి వదిలేశారు. దీంతో గంటల కొద్దీ వేచిచూసిన ప్రయాణికులు ఏం చేయాలో తోచక ఇండిగో విమానం వద్దనే రన్‌వేపై కూర్చునిపోయారు.  

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన 6ఈ 2977 విమానం ఆదివారం రాత్రి 10.40 గంటలకు టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. కానీ సిబ్బంది అందుబాటులో లేరని దాన్ని రన్‌వేపైనే ఆపేశారు. ఇండిగో చేసిన ఈ నిర్వాహకానికి ప్రయాణికులు తీవ్ర మండిపాటుకు గురయ్యారు. వెంటనే ట్విటర్‌ అకౌంట్‌లో ఇండిగోపై దుమ్ముత్తిపోశారు. కొందరు రన్‌వేపై తాము పడుతున్న అగచాట్లను ఫోటోలు తీసి సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. కొంతమంది ప్రయాణికులు విమానం వద్ద కూర్చుని ఉండగా.. మరికొందరు అక్కడే కూర్చుండిపోయారు. దాదాపు ఈ విమానం ఏడు గంటలకు పైగా రన్‌వేపైనే ఆగిపోయింది. సోమవారం ఉదయం 6.40కు విమానం టేకాఫ్‌ అయింది. 

రన్‌వేపై అగచాట్లు పడుతున్న తమకు ఉదయం ఆరు గంటలకు పీనట్స్‌, ఫ్రూటీ ఆఫర్‌ చేశారు కానీ విమానంలోకి ఎక్కనివ్వలేదని ప్రయాణికుడు ప్రణీత్‌ అలాగ్‌వాడి ట్వీట్‌ చేశారు. కనీసం ప్రయాణికులను టర్మినల్‌లోకి తీసుకెళ్లకపోవడం గమనార్హం. తీవ్ర కోపోద్రిక్తులైన ప్రయాణికులు, బెంగళూరు ఎయిర్‌పోర్టులో సైతం తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, మొత్తంగా 70కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇండిగో కూడా 30 విమానాలను డైవర్ట్‌ చేసింది.  అన్ని విమానయాన సంస్థలు ఈ వాతావరణ పరిస్థితులకు తీవ్ర ప్రభావితమయ్యాయి. అయితే సోమవారం ఉదయం వరకు ప్రయాణికులను ఎందుకు రన్‌వేపైనే వేచిచూడాల్సిన పరిస్థితి కల్పించారో విషయంపై మాత్రం ఇండిగో కామెంట్‌ చేయలేదు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top