ఎకానమీ వేగంగానే ఎదుగుతోంది.. | India fastest growing major economy, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఎకానమీ వేగంగానే ఎదుగుతోంది..

Jun 19 2018 1:16 AM | Updated on Sep 27 2018 9:08 PM

India fastest growing major economy, says Arun Jaitley - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ఎదుగుతోందనడంలో సందేహమేమీ లేదని, గతంకన్నా భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఎకానమీ వృద్ధికి సంబంధించి మార్చిలో నమోదైన 7.7 శాతం గణాంకాలే దీనికి నిదర్శనమన్నారు.

‘జీడీపీ వృద్ధి 2 శాతం క్షీణిస్తుందంటూ జోస్యం చెప్పిన వారి అంచనాలు తప్పని రుజువైంది‘ అని వ్యాఖ్యానించారు. డీమోనిటైజేషన్‌ భారీ తప్పిదమని, దీనివల్ల జీడీపీ వృద్ధిపై రెండు శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గతంలో అంచనా వేసిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు, పనిలో పనిగా మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, యశ్వంత్‌ సిన్హాల విమర్శలకు కూడా జైట్లీ దీటైన జవాబునిచ్చే ప్రయత్నం చేశారు. వ్యవస్థాగతమైన పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల విధానం, దివాలా చట్టం అమలు మొదలైన వాటితో దేశం రెండు త్రైమాసికాల పాటు సవాళ్లు ఎదుర్కొనాల్సి వచ్చిందని, అయితే ఇప్పుడు పరిస్థితులు గతంకన్నా మెరుగ్గా ఉన్నాయన్నారు.

సిన్హా విమర్శలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘పేదరికంలోనే గడిచిపోతుందేమోనంటూ నా కన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రముఖులు ఒకరు ఆందోళన చెందారు. కానీ అలాంటి భయాలేమీ అక్కర్లేదు. భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండబోతోంది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ ఏకంగా 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్‌ తన స్థానాన్ని పటిష్టంగా నిలబెట్టుకుంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం మరికొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగుతుంది‘ అని  పేర్కొన్నారు.  

అందరూ పన్నులు సక్రమంగా కట్టాలి..
వేతనజీవులు తమ వంతు పన్నులను సక్రమంగా చెల్లిస్తుండగా, చాలామటుకు ఇతర వర్గాలు కూడా తమ చెల్లింపుల రికార్డును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. అంతా నిజాయితీగా పన్నులు చెల్లిస్తే, ప్రభుత్వం ఆదాయం కోసం చమురు ఉత్పత్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. 

పెట్రోల్, డీజిల్‌ రేట్లను లీటరుకు రూ. 25 మేర తగ్గించవచ్చన్న పి. చిదంబరం సూచనలను జైట్లీ తోసిపుచ్చారు. ఇది ప్రభుత్వాన్ని ’బుట్టలో పడేసే’ ప్రయత్నమంటూ కొట్టిపారేశారు. చిదంబరం తన హయాంలో ఎన్నడూ కూడా అలాంటి చర్యలను కనీసం పరిశీలించను కూడా లేదని  ఫేస్‌బుక్‌లో ఒక పోస్టులో జైట్లీ పేర్కొన్నారు.  

మెరుగుపడిన ఉద్యోగావకాశాలు..
నిర్మాణ రంగం రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తుండటం, రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండటం, తయారీ రంగం వృద్ధి, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే పథకాలు మొదలైనవన్నీ కూడా ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పన అవకాశాలు పెరిగేందుకు తోడ్పడ్డాయని జైట్లీ చెప్పారు. పన్నుల వసూళ్ల తీరు ఇదే స్థాయిలో కొనసాగితే భవిష్యత్‌ మరింత మెరుగ్గా ఉండగలదన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ఎన్‌డీఏ సర్కారు కట్టుబడి ఉందన్నారు.


ఎయిరిండియాపై అధికారులతో జైట్లీ సమావేశం
ఎయిరిండియాలో వాటాల విక్రయ ప్రతిపాదన విఫలం అయిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై ఇతర సీనియర్‌ మంత్రులు, అధికారులతో జైట్లీ భేటీ అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, తాత్కాలిక ఆర్థిక మంత్రి పియుష్‌ గోయల్, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు దీనికి హాజరయ్యారు.

డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదన విఫలం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇచ్చిన నివేదికపై ఇందులో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నష్టాలు, రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో మెజారిటీ వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించినప్పటికీ ఆఖరు తేదీ మే 31 నాటికి ఒక్క సంస్థ కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే.   


నేడు గోయల్‌తో ప్రభుత్వ బ్యాంక్‌ల చీఫ్‌లు భేటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకుల చీఫ్‌లు మంగళవారం ఆర్థికమంత్రి పియూష్‌ గోయెల్‌తో సమావేశం కానున్నారు. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, మూలధన అవసరాలు, ఆర్థికమోసాల వంటి అంశాలుసహా బ్యాంకింగ్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై సమావేశం దృష్టి సారించనుంది.

పీఎన్‌బీ, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, యుకో బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, విజయాబ్యాంక్‌ల చీఫ్స్‌ ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. 2017–18 వార్షిక ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ చీఫ్‌లతో ఆర్థిక మంత్రిత్వ శాఖ జరుపుతున్న మొదటి సమావేశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement