నిర్మాణ రంగంలో ఇక విదేశీ నిధుల జోరు.. | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలో ఇక విదేశీ నిధుల జోరు..

Published Thu, Dec 4 2014 12:57 AM

నిర్మాణ రంగంలో ఇక విదేశీ నిధుల జోరు.. - Sakshi

సడలించిన ఎఫ్‌డీఐ నిబంధనలు నోటిఫై చేసిన ప్రభుత్వం
- కనీస నిర్మాణ విస్తీర్ణం తగ్గింపు
- మూలధనం, ఎగ్జిట్ నిబంధనల్లో మార్పులు

న్యూఢిల్లీ: నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింత ఆకర్షించే దిశగా కేంద్రం నిబంధనలను సడలించింది. కనీస నిర్మాణ విస్తీర్ణం తగ్గించడంతో పాటు మూలధన అవసరాలు, ఇన్వెస్టర్లు వైదొలిగే నిబంధనలను సవరించింది. నిర్మాణ రంగ అభివృద్ధి కోసం క్యాబినెట్ ఆమోదించిన సవరణలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం నోటిఫై చేసింది. దీని ప్రకారం కనీస ఫ్లోర్ ఏరియాను 50,000 చ.మీ. నుంచి 20,000 చ.మీ.కు తగ్గించింది. అలాగే, కనీస మూలధన పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలి యన్ డాలర్లకు తగ్గించింది. అటు ప్లాట్లు అభివృద్ధి చేసే విషయంలో కనీసం 10 హెక్టార్ల స్థలం ఉండాలన్న నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది.

ఈ మేరకు కన్సాలిడేటెడ్ ఎఫ్‌డీఐ పాలసీ సర్క్యులర్ 2014ని డీఐపీపీ విడుదల చేసింది. ఈ చర్యలతో నిర్మాణ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశీయంగా స్మార్ట్ సిటీల ఏర్పాటుకు,  అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి ఊతమివ్వగలదని భావిస్తోంది. టౌన్‌షిప్స్ మొదలైన వాటి నిర్మాణాల్లో ఆటోమేటిక్ పద్ధతి కింద 100% ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నా.. 2005 నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉండేవి. కొన్నాళ్లుగా నిర్మాణ, రియల్టీ రంగంలో ఎఫ్‌డీఐ నిధుల రాక భారీగా తగ్గింది. 2000 ఏప్రిల్-2014 ఆగస్టుమధ్య కాలంలో నిర్మాణ రంగంలో 23.75 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ వ్యవధిలో వచ్చిన ఎఫ్‌డీఐల్లో ఇది 10%. 2006-07 నుంచి 2009-10 దాకా భారీగా వచ్చిన పెట్టుబడులు ఆ తర్వాత మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి.
 
మరిన్ని విశేషాలు..

పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకెళ్లేందుకు 2 సంవత్సరాల లాకిన్ పీరియడ్ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఇన్వెస్టరు వైదొలిగేందుకు అనుమతించింది. బిల్డింగ్ ప్లాన్/లేఅవుట్‌కి సంబంధిత ప్రభుత్వ శాఖ అనుమచ్చిన తేదీనే ప్రాజెక్టు ప్రారంభ తేదీగా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా విదేశీ ఇన్వెస్టరు తన వాటాను మరో విదేశీ ఇన్వెస్టరుకు కూడా బదలాయించేందుకు  అవకాశాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఇలాంటి అనుమతులు ఇస్తారు. ఇక, ఎలాంటి గందరగోళం ఉండకుండా డెవలప్డ్ ప్లాట్లు, ఫ్లోర్ ఏరియా, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైన వాటి నిర్వచనాలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పూర్తయిపోయిన టౌన్‌షిప్‌లు, మాల్స్ మొదలైన వాటి నిర్వహణ కార్యకలాపాల్లోను 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ పద్ధతి వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement