మీకొక నామినీ కావాలి..?

importance of nominee in property - Sakshi

మీ పెట్టుబడులు మీ వారికి చెందే సులభ మార్గం 

నామినేషన్‌  నమోదు చేయడం ఎంతో వివేకమైన చర్య 

లేదంటే క్లెయిమ్‌కు చట్టపరమైన ప్రక్రియలతో కాలహరణం 

విల్లు రాసి రిజిస్టర్‌ చేసినా సరిపోతుంది 

కుటుంబ సభ్యులకే నామినీగా ప్రథమ ప్రాధాన్యం 

ఒక్కో సాధనంలో నిబంధనలు ఒక్కో మాదిరి 

ఎప్పుడైనా నామినీని మార్చే వెసులుబాటు

ఎన్నో రకాల ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడమనే అలవాటు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు ఆర్జించే ప్రతీ వ్యక్తి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా షేర్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో పెట్టుబడులు ఉంటుంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం వీటిని ఆశ్రయించే వారు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్‌ చేయడమనే కాకుండా, సంబంధిత వ్యక్తికి ప్రాణ ప్రమాదం జరిగితే పెట్టుబడులన్నీ కుటుంబానికి చెందేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పెట్టుబడి సాధనంలో నామినీ పేరును రిజిస్టర్‌ చేయడం లేదా విల్లు రాయడం... ఈ రెండింటిలో ఏదో ఒక్కటైనా తప్పనిసరిగా చేయడాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది...

ఓ ఇన్వెస్టర్‌ తను మరణం సంభవిస్తే, తన పేరిట ఉన్న పెట్టుబడులను స్వీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఫలానా అంటూ వారి పేరును నమోదు చేయడమే నామినేషన్‌ . ఆర్థిక సేవల సంస్థ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏఎంసీ, బీమా సంస్థలకు ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్‌ ఇది. నామినీ నమోదు చేయడం వల్ల పెట్టుబడులను వారి పేరిట బదిలీ చేయడం సులభతరం అవుతుంది. ఇన్వెస్టర్‌ మరణించిన తర్వాత వారి పేరిట ఉన్న పెట్టుబడులను నామినీగా ఉన్న వారు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నామినీ నమోదు చేసుకోకుండా, ఓ ఇన్వెస్టర్‌ మరణించినట్టయితే అప్పుడు వారసులు ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తుంది. క్లెయిమ్‌ చేసుకునే వారు ఇన్వెస్టర్‌ మరణ ధ్రువీకరణ పత్రం, ఇన్వెస్టర్‌తో తనకున్న అనుబంధం (లీగర్‌ హేర్‌ సర్టిఫికెట్‌), తనకున్న హక్కులను రుజువు చేసుకోవాల్సి వస్తుంది.

ఇదంతా ఎక్కువ సమయం, శ్రమతో కూడిన పని. ప్రతీ ఇన్వెస్టర్‌ నామినీ పేరును నమోదుతో పాటు, నిర్ణీత కాలానికి ఓసారి సమీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు... వివాహానికి పూర్వం బ్యాంకు ఖాతా తెరిచిన వారు, పెట్టుబడులు పెట్టిన వారు తమ తండ్రి లేదా తల్లి లేదా సోదరుల్లో ఒకరి పేరును నామినీగా ఇచ్చి ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత నామినీగా తన భార్యను చేర్చుకోవడం సరైన చర్య. మరో ప్రత్యామ్నాయంగా విల్లు రాసుకోవడం కూడా మంచిదే. తన తదనంతరం తన పేరిట ఉన్న పెట్టుబడులు, ఆస్తులు ఎవరికి ఎంత మేర చెందాలనేది విల్లులో స్పష్టం చేసినా సరిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... విల్లు రాసినట్టయితే, బీమా పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించిన నామినేషన్‌  రద్దయినట్టే. షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం నామినేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. భిన్న సాధనాల్లో నామినేషన్‌ , క్లెయిమ్‌ ప్రక్రియ వివరాలను పరిశీలిద్దాం... 

జీవిత బీమా 
కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల పాలవకుండా ఆదుకునే సాధనమే జీవిత బీమా. కనుక జీవిత బీమా పాలసీల్లో నామినీ పేరును నమోదు చేయడం ఎంతో అవసరం.  

ఎవరిని: పాలసీ హోల్డర్‌ మరణిస్తే బీమా పరిహారం ఎవరికి చెందాలని భావిస్తే వారి పేరును నామినీగా పేర్కొనాలి.  సాధారణంగా వారసులు లేదా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను బీమా సంస్థ సూచిస్తుంది. రక్త సంబంధీకులను అయినా నామినీగా నమోదు చేయవచ్చు. రక్త సంబంధీకులు కాని వారిని నామినీగా నమోదు చేయడానికి అవకాశం లేదు. నామినీ ఎన్ఆ‌ర్‌ఐ అయినా నమోదుకు అనుమతి ఉంటుంది. కాకపోతే క్లెయిమ్‌ మొత్తాన్ని భారత్‌లోని బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించడం జరుగుతుంది.  

ప్రక్రియ: నామినీ పూర్తి పేరు, వయసు, వారితో ఇన్వెస్టర్‌కు ఉన్న అనుబంధం వివరాలను బీమా పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా పేర్కొనవచ్చు. అప్పుడు విడిగా ఒక్కో నామినీకి ఎంత మొత్తం అనేది శాతం వారీగా ఆప్షన్‌  ఇవ్వాలి. పాలసీ కాల వ్యవధిలో నామినీని ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. చివరిగా ఇచ్చిన నామినేషనే వ్యాలిడేషన్‌ లో ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు ముగిసేలోపు క్లెయిమ్‌ దరఖాస్తు వస్తే బీమా సంస్థలు 120 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. మూడేళ్లు దాటితే 15 రోజుల్లోపు క్లెయిమ్‌ పరిష్కారాన్ని పూర్తి చేస్తాయి.  
ఎవరికి: నామినీకి క్లెయిమ్‌ హక్కు ఉంటుంది. ఒకవేళ విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తులకే పరిహారం చెల్లిం స్తారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఉండాలంటే, నామినీగా, విల్లులోనూ ఒకే పేరును పేర్కొనడం మంచిది.  

మ్యూచువల్‌ ఫండ్స్‌ 
సెబీ నిబంధనల మేరకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు నామినీ ఆప్షన్‌ ఇవ్వాలి. అయితే, నామినేషన్‌తప్పనిసరేమీ కాదు. ఇన్వెస్టర్లు  స్వీయ ప్రయోజనాల కోణంలోనే నామినీని తప్పనిసరిగా రికార్డు చేసుకోవడం అవసరం.   
ఎవరిని: ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వ్యక్తి ఎవరినైనా నామినీగా పేర్కొనవచ్చు. కాకపోతే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. మైనర్లనూ నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఎన్‌ర్‌ఐలను కూడా నామినీగా నమోదు చేసుకోవచ్చు. అయితే, సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్‌నర్‌షిప్‌ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్త, పవర్‌ ఆఫ్‌ అటార్నీ హోల్డర్‌లను నామినీగాలు పేర్కొనరాదు.  

నమోదు ప్రక్రియ: పెట్టుబడులకు సంబంధించి తొలుత దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నామినేషన్‌  రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా నామినీలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒక్కో నామినీకి మొత్తం విలువలో ఎంత మేర చెల్లించాలన్న శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ఎంతన్నది పేర్కొనకపోతే ఒకరికి మించి నామినీలు ఉంటే అప్పుడు అందరు నామినీలకు సమానంగా చెల్లిస్తారు. నామినీ పేరును పేర్కొంటూ దరఖాస్తుపై ఇన్వెస్టర్‌ సంతకం చేయాలి. జాయింట్‌ హోల్డర్స్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తే అందరి సంతకాలు అవసరం. ముఖ్యంగా ఫండ్స్‌లో ప్రతీ ఫోలియోకు విడిగా నామినేషన్‌ రిజస్టర్‌ చేసుకోవడం తప్పనిసరి. అన్నింటికీ ఒకటే  వర్తించదు. 

క్లెయిమ్‌: నామినీ ఎవరైనా కానీ, ఇన్వెస్టర్‌ మరణించిన తర్వాత క్లెయిమ్‌ చేసుకునే మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసులకు అందించాల్సి ఉంటుంది. అందుకే వారసులనే నామినీగా పేర్కొనడం మంచిదనేది నిపుణుల మాట.  

ఈక్విటీ షేర్లు 
కంపెనీల చట్టం, వాటాదారులు తమ పేరిట నామినేషన్‌ నమోదుచేసుకునేందుకు అనుమతిస్తోంది. కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు, జాయింట్‌ అకౌంట్‌ హోల్డర్స్‌ సైతం నామినేట్‌ చేయవచ్చు. అయితే, వ్యక్తులనే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్‌నర్‌షిప్‌ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్తను నామినీగా నమోదు చేయడం కుదరదు. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా నమోదు చేయొచ్చు.  

నమోదు ప్రక్రియ: డీమ్యాట్‌ రూపంలో షేర్లను కలిగి ఉంటే డీమ్యాట్‌ ఖాతాను నిర్వహించే డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (డీపీ) నామినేషన్‌ ను నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతా ప్రారంభ సమయంలో నామినీ కోసం ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉంటుంది. అక్కడే నామినీ పేరు, ఫొటో, వయసు, ఈ మెయిల్‌ ఐడీ, అనుబంధం, బ్యాంకు ఖాతా, చిరునామా వివరాలు ఉంటాయి. ఖాతా ప్రారంభంలో నామినీ వివరాలను ఇవ్వని వారు ఆ తర్వాత ఎప్పుడైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

క్లెయిమ్‌: ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాల్లో నామినీ క్లెయిమ్‌ చేసుకోవాల్సి వస్తే వారి పేరిట డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. నామినేషన్‌ లేకపోతే సంబంధిత షేర్లను ఇన్వెస్టర్‌ వారసులకు అందించడం జరుగుతుంది. ఇన్వెస్టర్‌ నామినేషన్‌ తోపాటు విల్లు కూడా రాసి ఉంటే కేవలం నామినేషన్‌నే పరిగణనలోకి తీసుకుంటారు.  

బ్యాంకు డిపాజిట్లు 
గతంలో అయితే నామినేషన్‌ను బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో ఖాతా ప్రారంభ సమయంలో, డిపాజిట్‌ సమయంలోనూ బ్యాంకు సిబ్బంది నామినేషన్‌  గురించి కస్టమర్లకు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్‌లేకుండానే ఖాతా తెరిచేందుకు, డిపాజిట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.  

నామినీ ఎవరిని?: వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు. అసోసియేట్, ట్రస్ట్, సొసైటీ లేదా ఇతర ఆర్గనైజేషన్‌ ఆఫీసుబేరర్‌ అయితే నామినీగా అవకాశం ఉండదు.  

ప్రక్రియ: నామినేషన్‌ నమోదు కోసం నామినీ పేరు, అనుబంధం, చిరునామా వివరాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు పాస్‌బుక్‌లో, అకౌంట్‌ స్టేట్‌మెంట్, డిపాజిట్‌లో నామినేషన్‌  రిజిస్టర్డ్‌ అని పేర్కొనడం తప్పనిసరి. నామినీ నమోదు, మార్పులకు, రద్దుకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది.

క్లెయిమ్‌: ఖాతాదారుడు లేదా డిపాజిట్‌ దారుడు మరణిస్తే నామినీలకు బ్యాంకులు బ్యాలన్స్‌ను చెల్లిస్తాయి. డిపాజిట్‌దారుని వారుసుల తరఫున ట్రస్టీగానే నామినీ వ్యవహరించాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసిన వ్యక్తి మరణించినట్టు బ్యాంకులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీకి సంబంధించి కేవైసీ ఇతర ధ్రువీకరణలు కూడా అవసరం. నామినేషనన్‌ రిజిస్టర్‌ కాకపోతే, వారసులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అందుకు వారసత్వ ధ్రువీకణ పత్రం, డెత్‌  సర్టిఫికెట్‌వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోవాలి...
బీమా పాలసీలు, మ్యూచువల్‌ఫండ్స్, షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో జాయింట్‌ అకౌంట్‌ హోల్డర్స్‌గా ఉంటే, అప్పుడు జాయింట్‌ హోల్డర్స్‌ అందరూ ఒకే సందర్భంలో మరణించినట్టయితేనే నామినేషన్‌  అమల్లోకి వస్తుంది. మైనర్‌ను నామినీగా నమోదు చేసేవారు, ఆ మైనర్‌ సంరక్షణ చూసే వారి పేరు వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా పాలసీలయితే నామినీ క్లెయిమ్‌ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు క్లెయిమ్‌ ఫామ్‌ను పూర్తి చేసి, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం(ఒరిజినల్‌), పాలసీ డాక్యుమెంట్‌ ఒరిజినల్‌ను జత చేయాలి. ఒకవేళ ప్రమాదంలో మరణించినట్టయితే ఎఫ్‌ఐఆర్‌/పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీ తనకు సంబంధించి కేవైసీ వివరాలను కూడా సమర్పించాలి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలోనూ క్లెయిమ్‌ కోసం ఇవే పత్రాలు అవసరం అవుతాయి. అదే షేర్లు అనుకుంటే, నామినీ అకౌంట్‌ క్లోజర్‌ ఫామ్‌(మరణించిన ఇన్వెస్టర్‌ అకౌంట్‌), ట్రాన్సమిషన్‌ రిక్వెస్ట్‌ (ఇన్వెస్టర్‌ పేరిట ఉన్న షేర్లను బదిలీ కోరుతూ), డెత్‌ సర్టిఫికెట్, క్లయింట్‌ మాస్టర్‌ రిపోర్ట్‌(డీమ్యాట్‌ ఖాతాకు సంబంధించి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, క్లెయిమ్‌ దాఖలు చేసే నామినీలు తమ డీమ్యాట్‌ ఖాతాను జాయింట్‌గా కలిగి ఉండరాదు. ఒకవేళ ఇన్వెస్టర్‌ నామినీని నమోదు చేసి లేకపోతే, ఇక్కడ పేర్కొన్న పత్రాలతోపాటు, వారసులు వారసత్వ సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధ వారసుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్‌ లేదా అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మైనర్‌ అయితే, గార్డియన్‌ గా ఉన్న వారు నామినీ తరఫున ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top