ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పరిరక్షణకు చర్యలు.. 

IL&FS Was Enriching Itself at Public Cost - Sakshi

కొత్త బోర్డు చైర్మన్‌  ఉదయ్‌ కొటక్‌ వెల్లడి ​​​​​​

తొలిసారి కొత్త బోర్డు భేటీ   

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ కానున్నట్లు సమావేశం అనంతరం బోర్డు చైర్మన్‌ ఉదయ్‌ కొటక్‌.. విలేకరులకు తెలిపారు. గ్రూప్‌ ఆడిట్‌ కమిటీ చైర్మన్‌గా బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆడిటర్‌ నందకిశోర్‌ ఎంపికయ్యారని చెప్పారు. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారమున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతుండటం.. మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు కొత్త బోర్డును నియమించింది. ఉదయ్‌ కొటక్‌ సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డులో సెబీ మాజీ చైర్మన్‌ జీఎన్‌ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ చైర్మన్‌ జీసీ చతుర్వేది, ఐఏఎస్‌ అధికారి మాలిని శంకర్, టెక్‌ మహీంద్రా వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ తదితరులు ఉన్నారు.  

మారుతీ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకునేది లేదు: భార్గవ 
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో తాను మారుతీ సుజుకీ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఆర్‌సీ భార్గవ ఖండించారు. చట్టప్రకారం తాను తప్పు చేసినట్లు రుజువైతే తప్ప తప్పుకోనక్కర్లేదని గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డైరెక్టరుగా వ్యవహరించిన భార్గవ తెలిపారు. వడ్డీలు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేవన్న అంశం మేనేజ్‌మెంట్‌కు మూడు నాలుగేళ్లుగా తెలుసన్నారు. బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఇది చర్చకు వచ్చేదని, తగు పరిష్కార మార్గాలపై ప్రణాళికల రూపకల్పన కూడా జరిగేదని చెప్పారాయన. యాజమాన్య నిర్వహణ లోపాలు, నిర్లక్ష్య ధోరణుల ఆరోపణలతో 10 మంది మాజీ డైరెక్టర్లపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వేసిన పిటీషన్‌లో భార్గవ పేరు కూడా ఉంది. ఈ పది మందిని ఇతర కంపెనీల బోర్డుల్లో కొనసాగనివ్వబోరంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.  

మార్కెట్‌పై సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు: జైట్లీ 
 ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్‌ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న ఆందోళనలు తలెత్తడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌కోటక్‌ నేతృత్వంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘ఇది దేశ అంతర్గత అంశం. వేగంగా దీనికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. కనుక ఏమంత తీవ్ర ప్రభావం ఉండదు’’అని జైట్లీ పేర్కొన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top