వైవిధ్యమైన పెట్టుబడుల కోసం...

ICICI Prudential Multi Assets Funds - Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌

గడిచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అస్థిరతలు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దారితీసేవే అయినప్పటికీ, స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టాలు ఇబ్బందే. రిస్క్‌కు విముఖంగా ఉండే ఇన్వెస్టర్లు, అదే సమయంలో మంచి రాబడులు కోరుకునే వారు మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ రిస్క్‌ను అధిగమించి మరీ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించింది. 

పెట్టుబడుల విధానం...: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. భిన్న రకాల సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం, అలాగే, డెట్, బంగారం వంటి ఇతర సాధనాల్లోనూ పెట్టుబడులతో స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. వైవిధ్యమైన అస్సెట్‌ క్లాసెస్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం అనుకూలం. ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 65% వరకు, డెట్, గోల్డ్‌/గోల్డ్‌ ఈటీఎఫ్‌లో 10–35% వరకు, రీట్, ఇన్విట్‌ వంటి సాధనాల్లో 0–10% వరకు ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. శంకరన్‌ నరేన్‌ 2012 ఫిబ్రవరి నుంచి ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 2006 సెప్టెంబర్‌ నుంచి 2011 ఫిబ్రవరి వరకు కూడా ఆయన ఈ పథకం నిర్వహణను చూశారు. ఆయనకు మొత్తం 29 ఏళ్ల అనుభవం ఉంది. ఇహబ్‌ దల్వాయి, అనుజ్‌ తగ్రా సైతం ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా ఉన్నారు. ఈక్విటీలో పెట్టుబడులు అధిక రాబడుల సాధనకు, డెట్, బంగారం ఇతర సాధనాల్లో పెట్టుబడులు రిస్క్‌ బ్యాలన్స్‌తోపాటు స్థిరమైన రాబడులకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 66.24% వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. ఫ్లెక్సీ క్యాప్‌ విధానాన్ని ఈక్విటీ పెట్టుబడులకు అనుసరిస్తుంది. అంటే అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి అన్ని మార్కెట్‌ క్యాప్‌ విభాగాల్లోనూ స్టాక్స్‌ను ఫండ్‌ మేనేజర్లు ఎంపిక చేసుకుంటుంటారు. ఈ పథకం డెట్‌ విభాగంలో 15.66%, బంగారం, ఇత ర కమోడిటీల్లో 12.82% ఇన్వెస్ట్‌ చేయగా, నగదు, నగదు సమానాలు 5.28% వరకు ఉ న్నాయి. ఈ పథకం ఇంధనం, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్, మెటల్స్‌ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ  ఉంది.

పనితీరు..: ఈ పథకం నిర్వహణలో రూ.11,060 కోట్ల ఆస్తులు జూలై చివరి నాటికి ఉన్నాయి. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌తో చూసుకుంటే మంచి పనితీరు చూపించింది. ఈ పథకం ఆరంభం నుంచి చూసుకుంటే సగటున 21.96% వార్షిక రాబడులిచ్చింది.  అదే కాలంలో బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ రాబడులు 17.90%. ఈ పథకం ఆరంభమైన 2002 అక్టోబర్‌ 31 నుంచి నుంచి ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చినట్టయితే ఈ ఏడాది జూన్‌ చివరికి రూ.97.62 లక్షలు సమకూరేది. ఇందులో పెట్టుబడి రూ.19.9 లక్షలు. ఈ పథకానికి మంచి డివిడెండ్‌ చరిత్ర కూడా ఉంది. ప్రతీ నెలా డివిడెండ్‌  చెల్లిస్తూనే ఉంది. మల్టీ అస్సెట్‌ ఫండ్‌ విభాగంలో పోటీ పథకాలైన యూటనై మల్టీ అస్సెట్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అస్సెట్‌ ఫండ్, యాక్సిస్‌ ట్రిపుల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్, ఎస్‌బీఐ మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ పథకమే మూడు, ఐదు, పదేళ్లు, ఆరంభం నుంచి అధిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
గమనిక: ఈ పథకం తమకు అనుకూలంగా ఉంటుందా, లేదా అన్నది ఇన్వెస్టర్లు తమ ఫైనాన్షియల్‌ సలహాదారును సంప్రదించి తెలుసుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top