హైదరాబాద్‌ రియల్టీలో వృద్ధి

Hyderabad Development in Realty - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉత్సాహం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, కార్యాలయాల లావాదేవీల్లో వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 11వ ఎడిషన్‌ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ శాంసన్‌ ఆర్థర్‌ మీడియాతో మాట్లాడారు. నివేదికలోని ముఖ్యమైన అంశాలివే..

5,430 యూనిట్ల అమ్మకం..
2019 హెచ్‌1లో నగరంలో కొత్తగా 5,430 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 హెచ్‌1లో ఇవి 3,706 యూనిట్లుగా ఉన్నాయి. ఫ్లాట్ల లాంచింగ్స్‌ ఎక్కువగా కూకట్‌పల్లి, మియాపూర్‌ వంటి ఉత్తరాది ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇక, అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ అర్ధ సంవత్సరంలో నగరంలో 8,334 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది హెచ్‌1లో ఇవి 8,313 యూనిట్లు. ఈ ఏడాది అమ్మకాల్లో 63 శాతం గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువ.

ధరల్లో 9 శాతం వృద్ధి..
నగరంలో సగటు చ.అ. ధరల్లో 9 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది హెచ్‌1లో చ.అ. సగటున రూ.4,012 కాగా.. ఇప్పుడది రూ.4,373కి పెరిగింది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్‌1తో పోలిస్తే 67 శాతం తగ్గి ప్రస్తుతం 4,265 యూనిట్లుగా నిలిచాయి. నిర్మాణం పూర్తయిన లేదా తుది దశలో ఉన్న గృహాల కొనుగోళ్లకే నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని, ఆయా గృహాలకు జీఎస్‌టీ లేకపోవటమే దీనికి కారణం.

38.5 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌
నగరంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 38.5 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. 2018 హెచ్‌1లో ఇది 26..9 లక్షల చ.అ.లుగా ఉంది. ఐటీ, ఐటీఈఎస్‌ రంగాలు 41 శాతం లావాదేవీలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ ధరలు 11 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం నెలకు చ.అ. ధర సగటున రూ.59 ఉంది. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాజెక్ట్‌లు విస్తరిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top