హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కష్టకాలం!

Housing finance companies, FY20 looks as bad as FY19 - Sakshi

2020 ఆర్థిక సంవత్సరంపై ఇక్రా నివేదిక

వృద్ధి 14–16%గా ఉంటుందని అంచనా

ముంబై: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) రుణాల వృద్ధి అవకాశాలను లిక్విడిటీ సంక్షోభం దెబ్బతీసిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019–20) కూడా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బలహీన మార్కెట్‌ పరిస్థితులు సైతం హెచ్‌ఎఫ్‌సీ ఆస్తుల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎఫ్‌సీలు 13–15 శాతం మధ్య రుణాల వృద్ధిని నమోదు చేస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2019–20లో ఇది 14–16 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. బలహీన నిర్వహణ పరిస్థితుల కారణంగా ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి ఉంటుందని అంచనా వేసింది. ఇళ్ల రుణాల విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) ప్రస్తుతమున్న 1 శాతం నుంచి మధ్య కాలానికి 1.3 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ప్రాజెక్టు రుణాలను కూడా కలిపి చూస్తే మొత్తం మీద హెచ్‌ఎఫ్‌సీల ఎన్‌పీఏలు 1.4 శాతం నుంచి 1.8 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.

ఈ పరిస్థితుల కారణంగా గతేడాది 18 శాతంగా ఉన్న మార్జిన్లు 14 శాతానికి పరిమితమవుతాయని అభిప్రాయపడింది. 2020 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలోనే ఉండొచ్చని పేర్కొంది. గత కొన్నేళ్లుగా మోర్ట్‌గేజ్‌ ఫైనాన్స్‌ను ఎన్‌బీఎఫ్‌సీలు సురక్షితంగా భావించడం జరిగిందని, ప్రధానంగా ఈ విభాగం నిద్రాణంగా ఉండడం వల్లేనని గుర్తు చేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దివాలా తీయడం ఫలితంగా ఈ రంగంలో నిధుల సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. హెచ్‌ఎఫ్‌సీల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయని ఇక్రా వివరించింది. ఇళ్ల రుణాల పోర్ట్‌ఫోలియో హెచ్‌ఎఫ్‌సీలకు, ఇతర రుణదాతులకు 18 శాతం నుంచి 13 శాతానికి దిగొచ్చినట్టు తెలిపింది. ఊహించని మార్కెట్‌ సంక్షోభాలను ఎదురైతే ఎదుర్కొనేందుకు హెచ్‌ఎఫ్‌సీలు నిధుల నిల్వలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయని తన నివేదికలో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top